విదుషి, సృజనశీలి, మానవి

ABN , First Publish Date - 2021-02-27T06:32:18+05:30 IST

తెలుగులో సృజనాత్మకత, విమర్శ, పాండిత్యం వంటి మూడు రంగాలలో సాహితీ విలువలు కలిగిన రచనలు చేసినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారి జాబితాలో ఆనందారామం ఒకరు. తులనాత్మక విమర్శ...

విదుషి, సృజనశీలి, మానవి

తెలుగులో సృజనాత్మకత, విమర్శ, పాండిత్యం వంటి మూడు రంగాలలో సాహితీ విలువలు కలిగిన రచనలు చేసినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారి జాబితాలో ఆనందారామం ఒకరు. తులనాత్మక విమర్శ, నవలా విమర్శకు సంబంధించి ఆమె చేసిన పరిశోధన గానీ, అధ్యయనం గానీ విమర్శ గానీ, తొలివరసలో నిలబడతాయి. ఏ విమర్శకుడికి తగ్గనంత గొప్ప విమర్శకురాలిగా ఆమె రచనలు చేశారు.


నేనువిద్యార్థినిగా 1979వ సంవత్సరం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా కనిపించిన స్త్రీమూర్తి డా. చిలకమర్రి ఆనందారామంగారు. ‘చీకటి కడుపున కాంతి’ నవల హిందీ అనువాద నవలగా రూపొందే క్రమంలో రచయిత్రిగా ఆమెతో నా పరిచయం పరోక్షమైనది. ఆ పరోక్ష రూపం కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. గలగలా మాట్లాడుతూ, సాదరంగా ఆహ్వానించిన మాతృమూర్తి డా. చిలకమర్రి ఆనందారామం. నాకు ఎంఫిల్‌లో ‘సమాజం – సాహిత్యం’ అనే అంశాన్ని బోధించేవారు. మార్క్సిజం పైన ప్రత్యేకమైన అభిరుచిని కనబరచి, తరగతి గదులలో సెమినార్‌లు నిర్వహించేవారు.


తెలుగులో సృజనాత్మకత, విమర్శ, పాండిత్యం వంటి మూడు రంగాలలో సాహితీ విలువలు కలిగిన రచనలు చేసినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.  అలాంటి వారి జాబితాలో ఆనందారామం ఒకరు. ప్రాగ్రూప విమర్శ, తులనాత్మక విమర్శ, నవలా విమర్శకు సంబంధించి ఆమె చేసిన పరిశోధన గానీ, అధ్యయనం గానీ విమర్శ గానీ, తొలివరసలో నిలబడతాయి. ఏ విమర్శకుడికి తగ్గనంత గొప్ప విమర్శకురాలిగా ఆమె రచనలు చేశారు.


పూలతోటలోని పూల సువాసన గాలిలో కలిసి ఆ ప్రాంతమంతా పరిమళభరితం అవుతుంది. మన ఇంటి ప్రాంగణంలో ఒక మల్లె పొదో, సన్నజాజితీగో ఉంటే ఆ వాసన మన ఇంటిని చుట్టుముట్టు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం వాటిని గమనించలేం. ఆ సుగంధం వల్ల మనలో ఒక రకమైన మంచి భావన, మృదుత్వం వస్తాయి. అలాంటి వాతావరణాన్ని తెలుగుశాఖలో సృష్టించి, ఆ లక్షణాలను మా అందరికీ అలవాటు చేసిన ఆనందారామం ఎప్పుడూ చెప్పుకోదగ్గ మంచి మనిషే. 


రూపంలోనూ, గుణంలోనూ, బోధనలోనూ ఆమెకు ఆమే సాటి. హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పరిశోధనకు ఒక కొత్తరకమైన ఒరవడితో పాఠ్యంశాలను సమకూర్చిన ఘనత ఆచార్య కొత్తపల్లి వీరభద్రరరావు, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, ఆనందారామంలకు దక్కుతుంది. అనేకమంది విద్యార్థులకు పరిశోధనలో పర్యవేక్షణ బాధ్యతను వహిస్తూ, దిశానిర్దేశం చేస్తూ తమ బోధనల ద్వారా స్ఫూర్తిని కలిగిస్తూ ఆలోచనలను ప్రోదిచేస్తూ పదునుపెట్టేవారు. 


నవలా రచయిత్రిగా సృజనాత్మక రచనలపై సాధికారతను సాధించినవారు డా. సి. ఆనందారామం. ఆమె కలం నుంచి వివిధ ప్రక్రియలలో అనేక రచనలు వెలువడ్డాయి. అవి సమాజాన్ని చైతన్యపథం వైపుగా నడిపించే రీతిలో ఉండేవి. ఆమె సుమారుగా 60 నవలలు, 100కి పైచిలుకు కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలను రచించారు. ‘ఆత్మబలి’ అనే నవల ‘సంసార బంధం’ సినిమాగా రూపొందింది. అదే నవల ‘జీవనతరంగాలు’ అనే ధారావాహికగా చాలా కాలం ప్రజల ఆదరణ పొందింది. ‘జాగృతి’ నవల ‘త్రిశూలం’ సినిమాగా, ‘మమతల కోవెల’ నవల ‘జ్యోతి’ సినిమాగా వచ్చాయి.


ఇటు సాహితీ రంగంలోనూ, అటు సినీరచనా రంగంలోనూ ఆనందరామం తనదైన స్థానాన్ని, ముద్రను వేసుకున్నారు. ఆమె అందుకున్న పురస్కారాలూ ఎన్నెన్నో. 1972వ సంవత్సరం ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’, 1979వ సంవత్సరం ‘తుఫాన్’ నవలకు గాను ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు’, రెండుసార్లు ‘తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం’ పొందారు. ఇవి కాక మాదిరెడ్డి, గోపీచంద్, మాలతీ చందూర్ తదితరుల పేరిట స్థాపించిన మరెన్నో పురస్కారాలూ ఆమెను వరించాయి. తెలుగు చలనచిత్రాలకు సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఆమె అనేక సంవత్సరాలు సేవలు అందించారు. 


ఆనందారామం తన రచనల్లో భిన్న దృక్పథాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ నిక్కచ్చిగా విమర్శించేవారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. సంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ సృజనాత్మక రచనల్లో ప్రతిఫలించే ఆమె ఆలోచనాక్రమం మాత్రం అభ్యుదయ భావజాలంతో నిండినదే. ఆచార్య సి. నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. నేడు ఆ గ్రంథం అనేకమంది పరిశోధకులకు కరదీపికగా నిలిచింది. నవలా రచయిత్రులు ఎన్ని నవలలు రాసినా తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో ఒక్క నవల పేరు మాత్రమే వారి పేరు పక్కన స్థిరరూపం దాల్చి ప్రచురణకు నోచుకోవడం బాధాకరం. ఒక రచయిత్రి రచించిన నవలల్లో కనిపించే సామాజిక పరిణామం కానీ, ఆలోచనా విధానం కానీ కాలానుగత మార్పులు కానీ సామాజిక స్వరూపాన్ని నిర్దుష్టంగా ప్రతిబింబించేవిగా ఉంటాయి. చరిత్ర నిర్మాణానికి సాహిత్యం, భాష, సంస్కృతి, శాసనాలు, నాణేలు ఏ రీతిగా ఉపయోగపడతాయో ఆ రీతిగానే సామాజిక స్వరూప నిర్మాణానికి నవలలు కూడా దారి చూపుతాయి. నవలా రచన కూడా చరిత్ర నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.


డా. సి. ఆనందారామంగారి అసలు పేరు ఆనందలక్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు దంపతులకు 1935వ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం ఏలూరులోనే సాగింది. అక్కడే ఉన్న సర్‌ సిఆర్‌ఆర్ కళాశాలలో వారి వృత్తి ప్రస్థానం మొదలైంది. తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో విధులు నిర్వహించారు. ఆమె పర్వవేక్షణలో చాలా విలువైన పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. జానపదం, వచన కవిత్వం, సాహిత్యంలో చరిత్ర, కథలు, నవలలు, నాటికలు తదితర ప్రక్రియలలో విశేషంగా పరిశోధనలు చేయించారు.


ఆనందారామంగారికి తెలుగు భాష అంటే అమితమైన ప్రేమాభిమానాలున్నాయి. ఒక వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ, మరో వైపు విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధిస్తూ, ఇంకో వైపు సృజనాత్మక రచనలు చేస్తూ, అనుకున్న సమయానికి రాసిన రచనలను ముద్రిస్తూ ఒక్క నిమిషం కాలం వృథా కాకుండా జీవించిన ఆవిడ ఈ నెల 10వ తేదీన ఈ లోకాన్ని వీడిపోవడం ఆమెను ఇష్టపడే వారందరికీ బాధాకరమే. ఆనందారామం జీవిత ప్రయాణంలో సహచరుడు చిలకమర్రి రామాచార్యులుగారి నుంచి లభించిన సహకారం గొప్పది. ఆమె తన భర్త పేరును కలుపుకుని ఆనందరామంగా ప్రసిద్ధి చెందారు. ఒక స్త్రీమూర్తి సిసలైన ఎదుగుదల, విజయాల వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనడానికి నిదర్శనంగా రామాచార్యులు నిలుస్తారు.


మనసులో ఆలోచన జనియించిన వెంటనే దానికి అక్షరరూపం ఇవ్వాలని సంకల్పించుకుని రచనలు చేసేవారు ఆనందరామం. ఆమెకు చిన్నతనం నుంచి తార్కికదృష్టి ఉండడంతో ఆమె రచనలలో కూడా అది ప్రతిఫలించేది. స్వీయచరిత్ర రాసుకుంటే ‘వైరి సమాసం’ అనే పేరుతో రాసుకుంటానని ఆనందారామం ఈ మధ్యనే ఒక ఇంటర్వూలో చెప్పారు. కానీ రాయకుండానే వెళ్లిపోయారు. ఆమెతో ఉన్న శిష్య, సహ అధ్యాపక సంబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.


ఆచార్య జి. అరుణకుమారి

తెలుగు శాఖాధ్యక్షులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-02-27T06:32:18+05:30 IST