కొత్త కలెక్టరేట్‌లో కార్యకలాపాలు షురూ

ABN , First Publish Date - 2021-06-22T04:30:37+05:30 IST

సిద్దిపేట నూతన కలెక్టరేట్‌లో కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తమతమ పనుల్లో

కొత్త కలెక్టరేట్‌లో కార్యకలాపాలు షురూ
సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలు

 సమీక్షలతో బిజీబీజీగా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి 

 సందర్శకులతో సందడిగా మారిన కలెక్టరేట్‌

 రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన వారే ఎక్కువ


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట/కొండపాక జూన్‌ 21: సిద్దిపేట నూతన కలెక్టరేట్‌లో కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి బిజీబిజీగా గడిపారు. ఉదయం ఆయుష్‌శాఖ వారు కలిసి అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ధరణి, వరి విత్తనాలు వెదజల్లే సాగుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయ సముదాయాన్ని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. భవనం ముందు సెల్ఫీలు దిగారు. వివిధశాఖల అధికారులను కలవడానికి వచ్చిన వారు సైతం కలెక్టరేట్‌ అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. పలువురు రేషన్‌డీలర్లు రెవెన్యూ అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


దూరం.. భారం

సిద్దిపేటకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కలెక్టర్‌ కార్యాలయం ఉండడంతో వివిధ సమస్యలపై, పనులపై వచ్చే వారికి ఇబ్బందికరంగా మారింది. పనుల కోసం వచ్చినవారు ప్రత్యేకంగా ఆటోను మాట్లాడుకుని రావడం కనిపించింది. సిద్దిపేటకు రాను, పోను ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుంటే రూ.200 తీసుకున్నాడని పట్టణానికి చెందిన నజీరుద్దీన్‌ అనే వ్యక్తి తెలిపాడు. రేషన్‌కార్డులో పేరు నమోదు చేయడం చేయడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పాడు. సమస్య పరిష్కారం కోసం రావడం తప్పనిసరి అని అందుకే ఖర్చు అయినా ఆటోలో వచ్చామని మరో వ్యక్తి తెలిపారు. కొత్త కలెక్టరేట్‌కు రావాలి అంటే ప్రత్యేకంగా వాహనం ఉండాల్సిందేనని పలువురు తమ అభిప్రాయం చెబుతున్నారు. వాహనాలు లేని వారు ప్రత్యేకంగా ఆటోలను తీసుకొని వచ్చారు. పలువురు తమ సొంత బైక్‌లపై వచ్చారు.


 రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన వారే ఎక్కువ

కలెక్టరేట్‌కు వచ్చిన వారిలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన వారే ఉన్నారు. ధరణిలో తప్పులు జరిగాయంటూ సరిదిద్దాలని చెప్పడం కోసం కలెక్టరేట్‌ వెయిటింగ్‌ హాల్‌లో కూర్చోవడం కనబడింది. 


 ప్రత్యేక బస్సు నడపాలి

కలెక్టరేట్‌కు సిద్దిపేట నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట నుంచి రావాలంటే ప్రత్యేకంగా వాహనం ఉండాల్సిందేనని అందరికీ అవి సాధ్యమయ్యే పని కాదని పలువురు తెలిపారు. సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయం రాజీవ్‌ రహదారి పక్కనే ఉంది. సిద్దిపేట నుంచి కలెక్టర్‌ కార్యాలయం వెళ్లాలంటే దర్గాకమాన్‌ వద్ద నుంచి యూటర్న్‌ తీసుకుని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకోవాలి. అలాగే కలెక్టర్‌ కార్యాలయం నుంచి హైదరాబాద్‌ వైపు అంటే కొండపాక, గజ్వేల్‌, చేర్యాల తదితర ప్రాంతాల వారు తిరిగి వెళ్లాలంటే రాంగ్‌ రూట్‌లో కొద్దిదూరం వెళ్లాల్సి ఉంటుంది. యూటర్న్‌ తీసుకోవాలి అంటే ఒక కిలోమీటర్‌ అయినా వెళ్లాల్సి ఉంటుంది. కిలోమీటర్‌ దూరం వెళ్లకుండా రాంగ్‌రూట్‌లోనే కొద్దిదూరంలోనే ఉన్న యూటర్న్‌ల ద్వారా హైదరాబాద్‌ వైపు వాహనాలు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం సర్వీసు రోడ్డు వేయాలని పలువురు కోరుతున్నారు. అయితే కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభమైంది కానీ క్యాంటిన్‌ సౌకర్యం ప్రస్తుతానికి ఏర్పాటు కాలేదు. వివిధ పనులు మీద కలెక్టరేట్‌కు వచ్చిన వారు మధ్యాహ్నం సమయంలో ఏమైనా తిందామంటే ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డారు. 






Updated Date - 2021-06-22T04:30:37+05:30 IST