నేరడి కొలిక్కి వచ్చేనా?

ABN , First Publish Date - 2022-06-27T06:22:26+05:30 IST

నేరడి బ్యారేజీ వివాదం ఇప్పటిది కాదు. 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఒడిశాతో జల వివాదమే ఇందుకు కారణం.

నేరడి కొలిక్కి వచ్చేనా?



(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
నేరడి బ్యారేజీ వివాదం ఇప్పటిది కాదు. 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఒడిశాతో జల వివాదమే ఇందుకు కారణం. వంశధార నీరు 110 టీఎంసీలు వస్తుండగా.. ఇరు రాష్ట్రాలు చెరి సగం నీటిని వాడుకోవాలన్నది నిబంధన. దీనిపైనే ఇరు రాష్ట్రాల సీఎంలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి మాత్రం ఒడిశా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. బ్యారేజీ నిర్మాణంతో వందల ఎకరాల భూములు ముంపు బారిన పడతాయన్నది ఒడిశా వాదన. దీనిపై కోర్టు వివాదం నడిచింది. వంశధార జల వివాదాల ట్రెబ్యునల్‌ ఆంధ్రాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో 20 టీఎంసీ నీటిని డైవర్షన్‌ చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు గత ఏడాది నవంబరు 9న సీఎం జగన్‌ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ మనుగడ ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రత్యామ్నాయంగా గొట్టా బ్యారేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం మిగులు సామగ్రిని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రూ.150 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేశారు. ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే కానీ.. రిజర్వాయర్‌కు సార్థకత చేకూరదు. దీనిపై సీఎం జగన్‌ దృష్టిసారించాల్సిన అవసరముంది. మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు ప్రస్తుతం 70శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ చిన్నగా ఉంటే...స్ట్రక్చర్లు ఎక్కువగా నిర్మించాల్సివస్తోందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ పనులు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయో స్పష్టత లేదు.
- జిల్లాలో ఉద్దానం ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి కబళిస్తోంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ప్రకటించింది. అయితే పనులు మూడడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నాయి.
----------


Updated Date - 2022-06-27T06:22:26+05:30 IST