సార్లు వస్తున్నారహో..

ABN , First Publish Date - 2022-08-18T05:11:01+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక తేదీ ఖరారుకాకున్నా బహిరంగ సభల సందడి ఊపందుకుంది. పోలింగ్‌ సమీపించిందనే స్థాయిలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు.

సార్లు వస్తున్నారహో..

 20న మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభ

 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ

 ఓ వైపు జనసమీకరణ, మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌

 చేరికలకు తెరలేపిన బీజేపీ

 సీఎం సభరోజే మును గోడుకు కాంగ్రెస్‌ దిగ్గజాలు

 మునుగోడు ఉప ఎన్నిక తేదీ ఖరారుకాకున్నా బహిరంగ సభల సందడి ఊపందుకుంది. పోలింగ్‌ సమీపించిందనే స్థాయిలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు. మునుగోడులో ఈనెల 20న సీఎం కేసీఆర్‌, 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉన్నాయి. సీఎం సభ రోజే ప్రతీ గ్రామంలో ఒక కాంగ్రెస్‌ దిగ్గజంతో పాదయాత్ర నిర్వహించాలని పీసీసీ నిర్ణయంతో నియోజకవర్గంలో హడావిడి నెలకొంది. మరోవైపు ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, సభలకు జనాల తరలింపునకు పెద్ద సంఖ్యలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో మునుగోడు వేడి సర్వత్రా కనిపిస్తోంది. ఏ గ్రామంలో చూసినా ఖరీదైన కార్లు, బడా నేతల హడావిడి, సభలు, సమావేశాలతో సందడి వాతావరణం నెలకొంది.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)


సాధారణ ఎన్నికలకు ముందు వస్తున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే సందడి చేయాలని అధికార టీఆర్‌ఎస్‌ తొలుత నిర్ణయించినా, ఆ తర్వాత పునరాలోచనలో పడింది. బీజేపీ వ్యూహాల కు చెక్‌పెట్టే క్రమంలో ఈనెల 21న అమిత్‌షా సభ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 20న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిం ది. 10రోజుల వ్యవధిలో లక్ష మందితో సభ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా కేవలం ఉమ్మడి జిల్లా నేతలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. దీన్ని ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్న మంత్రి జగదీ్‌షరెడ్డి ఎమ్మెల్యేలందరినీ నియోజకవర్గం లో మోహరించారు. ప్రతీ మండలానికి ఇద్దరు నేతలు గ్రామాలు పంచుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మునుగోడు లో సభాస్థలి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్ష మందికి తగ్గకుండా ఉండేందుకు అవసరమైన వ్యూహాలను నిరంతరం చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌, రాజగోపాల్‌ ఆధీనంలోని ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎ్‌సవైపు మళ్లించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. సీఎం కేసీఆర్‌ సభ రోజే భారీగా చేరికలు చూపాలని నిర్ణయించినా, సమాచారం లీక్‌ అవుతూ ఎదుటి పార్టీ నుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో అర్ధరాత్రి అనేది కూడా లేకుండా ఎక్కడ ఉంటే అక్కడ ఫిరాయింపుదారులకు పార్టీ కండువా కప్పుతున్నారు. చేసుకున్న ఒప్పందంలో భాగంగా చెల్లింపులు చకచకా సాగిపోతున్నాయి.


చేరికలకు తెరలేపిన బీజేపీ

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులందరితో టచ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అమిత్‌షా సభ రోజు భారీగా చేర్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు. అధికార పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న నేతలను తన టచ్‌లో ఉంచుకున్నారు. పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఖరారవుతారన్న సమాచారంతో అసంతృప్త నేతలు ఓ వైపు రాజగోపాల్‌రెడ్డి, మరోవైపు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ వలసలను ఆపే క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ కేసులు, అరెస్టుల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అప్రమత్తమైన అసంతృప్త నేతలు అమిత్‌షా సభ వరకు వేచి చూడకుండా కమలం కండువా కప్పుకుంటున్నారు. చండూరు మండలానికి చెందిన ఐదుగురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు బుధవారం చేరికల కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. వీరు పార్టీని వీడుతున్నారన్న సమాచారం మంత్రికి తెలియడంతో ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభం కావడంతో, ఆ ఐదుగుకు హుటాహుటిన కమలం గూటికి చేరిపోయారు. అమిత్‌షా సభ రోజు భారీగా చేరికలను చూపించి రాజగోపాల్‌రెడ్డి తన ఇమేజ్‌ను చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు.


టీఆర్‌ఎ్‌సలో ఆగని టికెట్‌ ప్రయత్నాలు

టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కించుకునేందుకు ఆశావహులు ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మినహా ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని అసంతృప్త నేతలు అంటున్నారు. భారీగా సమావేశాలు, వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం అవుతుండడం, ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా, మూడున్నరేళ్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నేపథ్యంలో సర్వేలో ఆయన పేరే వస్తుందని, కొంత లోతుగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అసంతృప్త నేతలు సీఎంకు వివరించారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు. 

అభ్యర్థి ఎవరైతే గెలుపు సులువవుతుంది. ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్‌ పార్టీపై ఓటర్ల మనోగతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం పనిచేయడం, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా, ప్రస్తుతం డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తనను అభ్యర్థిగా పరిశీలించాలని ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి ఇటీవల సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన టీఆర్‌ఎస్‌ పెద్దలను ఆశ్రయించి తనకున్న రాజకీయ, ఆర్థిక శక్తికి సంబంధించిన విషయాలను వివరించినట్లు సమాచారం.


సీఎం సభ రోజే కాంగ్రెస్‌ దిగ్గజాలు

మునుగోడులో ఈనెల 20న సీఎం కేసీఆర్‌ సభ ఉండగా, అదేరోజు రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్‌ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు. సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీ వంటి నేతలు ఒక్కో గ్రామానికి ఒకరు చొప్పున చేరుకుని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. సీఎం సభ రోజు ఇబ్బందే అని తొలుత అనుకున్నా, ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉండాలంటే అదేరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ క్యాడర్‌ ఎంత మంది కలిసివస్తారో తెలిసిపోతుందని నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది. పీసీసీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించగా, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ పాల్గొని 20న కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


బీజేపీలో చేరిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు

మునుగోడు రూరల్‌, చండూరు రూరల్‌, ఆగస్టు 17: టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బుధవారం బీజేపీలో చేరారు. మునుగోడు మండలం చల్మెడ సర్పంచ్‌ భర్త కర్నాటి ఊషయ్య, చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌ కురుపాటి రాములమ్మ, సైదులు, కస్తాల సర్పంచ్‌ మెండు ద్రౌపతమ్మ వెంకట్‌రెడ్డి, చొప్పరివారిగూడెం సర్పంచ్‌ చొప్పరి అనురాధవెంకన్న, దోనిపాముల సర్పంచ్‌ తిప్పర్తి దేవేందర్‌, నెర్మట సర్పంచ్‌ నందికొండ నర్సిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.


గెలుపే లక్ష్యంగా పని చేయాలి

 మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణికం ఠాకూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీకా గౌరవ్‌ యాత్రను విజయవంతం చేసినందుకు డీసీసీ అధ్యక్షులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతిని సందర్భంగా  మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో పార్టీల నేతలు కార్యక్రమాలు చేపట్టాలని కార్యచరణ రూపొందించామన్నారు. గ్రామంలో కనీసం 100 కుటుంబాలను కలిసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం

 కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ, సంస్థాన్‌నారాయణపురం మండలం, మునుగోడులో లబ్ధిదారులకు మంజూరైన నూతన పింఛన్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్య యాదవ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, చేనేత కార్మికులు, రైతు కూలీల ఆకలి చావులు, ఆత్మహత్యల ను నిరోధించామన్నారు. ప్రజలకు అందిస్తున్న స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ నీటితోనే ఫ్లోరోసిస్‌ మహమ్మారి నుంచి విముక్తి కల్పించామన్నారు. దీంతో ఆరేళ్ల కాలంలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదు కాలేదని, ఇది సీఎం కేసీఆర్‌ విజయమన్నారు. గత పాలకులు చేసిన దుర్మార్గపు చర్యలతో నే ఫ్లోరోసిస్‌ సమస్య నెలకొందన్నారు. 1970నుంచే ఫ్లోరోసిస్‌ సమస్య ప్రారంభమైందని, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ఉద్య మ సమయంలో కేసీఆర్‌ మునుగోడు సమస్యలను అధ్యయనం చేశారని, ఆ క్రమంలోనే ఫ్లోరోసిస్‌ పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, మర్రిగూడ పాశం సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మిర్యాల వెంకన్న, ఈద శరత్‌బాబు, నారబోయిన రవిముదిరాజ్‌, చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి వెంకటే్‌షగౌడ్‌, సర్పంచ్‌ సికిలమెట్ల శ్రీహరి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య తదితరులు పాల్గొన్నారు.


సభ ఏర్పాట్ల పరిశీలించిన మంత్రి

మునుగోడులో ఈనెల 20న టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ ఏర్పాట్లను మంత్రి జగదీ్‌షరెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయన వెంట టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, యలమంచిలి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


టీఆర్‌ఎ్‌సలో చేరిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

 కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. చేరినవారిలో మర్రిగూడ వైస్‌ ఎంపీపీ కక్కూరి వెంకటేష్‌, లెంకలపల్లి, సరంపేట సర్పంచ్‌లు పాక నగేష్‌, నర్సింహ, ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, నాంపల్లి మండలానికి చెందిన పెద్దాపురం ఎంపీటీసీ సప్పిడి రాధికశ్రీనివా్‌సరెడ్డి, దేవత్‌పల్లి ఎంపీటీసీ సుజాతశంకర్‌ ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పందలు యాదయ్యగౌడ్‌, తోటకూర శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:11:01+05:30 IST