కమ్మేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-21T05:12:38+05:30 IST

జిల్లాలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ మేరకు 24 గంటల్లో 297 కేసులు నమోదు అయ్యాయి.

కమ్మేస్తున్న కరోనా
కడప ఆర్టీసీ బస్టాండ్‌లో భౌతిక దూరం పాటించని ప్రయాణీకులు

 శరవేగంగా సెకెండ్‌ వేవ్‌

 పల్లె, పట్నం అంతటా విస్తరిస్తున్న వైరస్‌

 20 రోజుల్లో 2981 పాజిటివ్‌ కేసులు నమోదు

 బేంబేలెత్తుతున్న జనం

 మాస్క్‌.. శానిటైజేషన్‌.. భౌతికదూరం నామమాత్రమే


కడప గడప బిక్కుబిక్కుమంటోంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా మహమ్మారిలా అంతటా కమ్మేస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు నుంచి నలుగురు వరకు కరోనా బాధితులు ఉన్నారు. కరోనా పంజా విసురుతున్నా పట్టణవీధుల్లో రద్దీ తగ్గడం లేదు. మాస్క్‌.. శానిటైజేషన్‌.. భౌతికదూరం నామమాత్రమే. జనవరి నెలలో 262 కేసులు నమోదయితే.. మార్చి నెలలో 445 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఈ 20 రోజుల్లోనే 2,981 కేసులు నమోదయ్యాయంటే, కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విశ్వరూపం చూపుతోందో అర్థమవుతోంది. కఠినచర్యలు, పక్కా వ్యూహంతో కరోనాను కట్టడి చేయకపోతే, కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

(కడప - ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ మేరకు 24 గంటల్లో 297 కేసులు నమోదు అయ్యాయి. ప్రొద్దుటూరు, కడప, నందలూరు, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, దువ్వూరు, బద్వేల్‌, రాయచోటి, రైల్వేకోడూరు, పులివెందుల పట్టణాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జనవరి నుంచి కరోనా సెకెండ్‌ వేవ్‌ పంజా విసురుతున్నా, జిల్లాలో అంత ప్రభావం చూపలేదు. రోజుకు 50-60 మధ్య కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ఏప్రిల్‌ 1న 63 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత విశ్వరూపం చూపుతూ 20 రోజుల్లో 2981 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులో 11వ తేదీ నుంచి 20 తేదీ వరకు అంటే కేవలం 10 రోజుల్లో 2125 కేసులు నమోదు కావడం కొసమెరుపు. ఈ పదిరోజులుగా సగటున రోజుకు 213 కేసులు నమోదు అవుతున్నాయి.


కట్టడి ఏదీ..?

కరోనా కట్టడికి మాస్క్‌, శానిటైజేషన్‌, భౌతికదూరం.. ఈ మూడు ప్రధాన అస్ర్తాలని వైద్యనిపుణులు పదేపదే సూచిస్తున్నారు. అయితే, జిల్లాలో ఏ పట్టణానికి వెళ్లినా, ఏ పల్లెటూరులో చూసినా కరోనా కట్టడి నిబంధనలు పాటించడం లేదు. ఓ పక్క పోలీసులు జరిమానా విధిస్తున్నా మరో పక్క ప్రజలు మాత్రం నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సినిమాహాళ్లు, మాల్స్‌, మద్యం దుకాణాలు, ఇరుకుగా ఉండే వాణిజ్యప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించకపోయినా, జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

కరోనా రవాణా...

కడప మీదుగా హైదరాబాదు, చెన్నై, ముంబాయి వంటి ప్రధాన నగరాలకు రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి భారీగా ఉంది. జిల్లావాసులు తప్పని పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణం చేయాల్సివస్తుంది. అదే క్రమంలో కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల నుంచి బెంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయా పట్టణాల్లో కరోనా అనుమానితులు అదే బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతుందన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో 50 శాతం ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు నడిచేలా  అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


అందుబాటులో 2,812 బెడ్లు

కరోనా బాధితుల చికిత్స కోసం కడప రిమ్స్‌లో 310, ఫాతిమా మెడికల్‌ కళాశాలలో 450, ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రిలో 180, పులివెందుల ఏరియా ఆస్పత్రిలో 10 బెడ్లు ఏర్పాటు చేశారు. అందులో 480 బెడ్లల్లో ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. అలాగే 5 కొవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. హాజ్‌హౌస్‌ కొవిడ్‌ సెంటర్‌లో 363 బెడ్లు, పులివెందుల ఏపీ కార్ల్‌లో 250, ప్రొద్దుటూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో 200, రాయచోటి మైనార్టీ పాలిటెక్నిక్‌ కళాశాలలో 150, రైల్వేకోడూరు మండలం అనంతరాజుపల్లి హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయంలో 200 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో కేవలం 288 మంది బాధితులు మాత్రమే అయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 1052 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా కరోనా లక్షణాలతో ఇళ్లల్లోనే సొంత వైద్యం చేసుకుంటున్న వారు మరెందరో ఉన్నారు. 


ఏప్రిల్‌లో 11 మంది మృతి

కరోనా లక్షణాలతో 24 గంటల్లో ముగ్గురు మృతిచెందినట్లు వైద్యఆరోగ్య శాఖ ఇచ్చిన బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది. ఈ నెల 20 రోజుల్లో కరోనా బారిన పడి 11 మంది మృత్యువాత పడ్డారు. కరోనా కేసులు పెరుగుతున్నా, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఊపిరి పీల్చుకునే అంశమైనా, నిర్లక్ష్యం పనికిరాదని వైద్యులు పేర్కొంటున్నారు. 


పది రోజుల్లో కరోనా కేసులు

తేదీ కేసులు

----------------------

11 192

12 259

13 334

14 112

15 96

16 243

17 200

18 203

19 189

20 297

----------------------

మొత్తం 2125



ఏ నెలలో ఎన్ని కేసులు

-----------------------------

నెల కేసులు

------------------------------

జనవరి 262

ఫిబ్రవరి 109

మార్చి 445

ఏప్రిల్‌ 2981 (20వతేదీ వరకు)

 




Updated Date - 2021-04-21T05:12:38+05:30 IST