పోలవరం పనుల్లో.. రానున్న 45 రోజులే కీలకం!

ABN , First Publish Date - 2021-04-08T07:30:11+05:30 IST

వర్షాలు ప్రారంభమయ్యేలోగా పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో కీలకపనులు పూర్తిచేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘‘రానున్న 45 రోజులు అత్యంత కీలకం. ఆర్థికంగా కష్టకాలమే అయినప్పటికీ పోలవరం సహా ప్రాజెక్టులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.

పోలవరం పనుల్లో.. రానున్న 45 రోజులే కీలకం!

  • -పోలవరం హెడ్‌వర్క్స్‌ పనుల్లో వేగం
  • -అవి వర్షాలకు ముందే పూర్తికావాలి
  • -కాఫర్‌ డ్యామ్‌లోని ఖాళీలన్నీ పూర్తి
  • -అప్రోచ్‌ చానల్‌ పనులూ వేగవంతం
  • -ప్రాధాన్య ప్రాజెక్టులు ఆగడానికి లేదు
  • -జలవనరుల సమీక్షలో సీఎం నిర్దేశం


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వర్షాలు ప్రారంభమయ్యేలోగా పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో కీలకపనులు పూర్తిచేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘‘రానున్న 45 రోజులు అత్యంత కీలకం.  ఆర్థికంగా కష్టకాలమే అయినప్పటికీ పోలవరం సహా ప్రాజెక్టులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. ఇందుకోసం నిధుల విడుదల సహా అన్ని విధాలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది’’ అని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం సాగునీటి ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష జరిపారు. మే నెలకల్లా కాఫర్‌ డ్యామ్‌లోని ఖాళీలు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అప్రోచ్‌ చానల్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వాటిని కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, ఈ రెండు పనులు అత్యంత కీలకమైనవనీ, వెంటనే వాటిపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ‘‘స్పిల్‌ చానల్‌లో మట్టి తీయడం, కాంక్రీట్‌ పనులు చేయడం  అత్యంత అవశ్యకం.  వాటిపై దృష్టి పెట్టి, వేగవంతంగా పనులు చేయాలి’’ అని నిర్దేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రభుత్వం నిర్ణయించిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ అవుకు టన్నెల్‌- 2, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌-1, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌-2 సహా వెలిగొండలో మిగిలిన పనులు, వంశధార-నాగావళి లింక్‌, వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌ -2 తదితర పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిలో నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు మేనాటికి పూర్తి చేస్తామని, అవుకు టన్నెల్‌ -2లో వేగవంతంగా పోరింగ్‌ పనులు జరుగుతున్నాయని, అవి ఆగస్టునాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి  మొత్తంగా 20,000 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లేలా సొరంగాలు సిద్ధమవుతాయని అధికారులు సీఎంకు చెప్పారు. వెలిగొండ మొదటి టన్నెల్‌ ఇప్పటికే పూర్తయిందని, రెండో టన్నెల్‌ డిసెంబరు నాటికి పూర్తవుతుందని చెప్పారు. వెలిగొండ టన్నెల్‌ సొరంగం ద్వారా సెప్టెంబరు నాటికి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.


ప్రాధాన్యతలు మరవొద్దు

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. వంశధార, నాగావళి పనులు, వంశధార ఫేజ్‌-2లో స్టేజ్‌-2 పనులు జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పా రు. నేరడి బ్యారేజీ నిర్మాణంలోభాగంగా ఒడిశాతో ఉన్న సమస్యపై దృష్టి సారించాలని సీఎం కోరారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందేనన్నారు. ప్రాధాన్య తా ప్రాజెక్టులు పూర్తయ్యాకే మిగిలిన ప్రాజెక్టులపై దృష్టి సా రించాలనీ, మహేంద్రతనయ, మడ్డువలస ఫేజ్‌-2, తారకరా మ తీర్థసాగర్‌ తదితర పనులను ముందస్తుగా చేపట్టాలని సూచించారు. సీమ ఎత్తిపోతల పథకం, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.

Updated Date - 2021-04-08T07:30:11+05:30 IST