కామిక్‌ భల్లే... భల్లే...

ABN , First Publish Date - 2020-03-14T06:32:24+05:30 IST

చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారైనా తలచుకుని మురిసిపోని వారుండరు. బాల్యాన్ని మళ్లీ చూసుకునే రోజు వస్తే బాగుంటుంది అనుకునేవారు చాలామందే. ఢిల్లీకి చెందిన కామిక్‌ ఆర్టిస్ట్‌ దశ్మీత్‌ సింగ్‌ తన...

కామిక్‌ భల్లే... భల్లే...

చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారైనా తలచుకుని మురిసిపోని వారుండరు. బాల్యాన్ని మళ్లీ చూసుకునే రోజు వస్తే బాగుంటుంది అనుకునేవారు చాలామందే. ఢిల్లీకి చెందిన కామిక్‌ ఆర్టిస్ట్‌ దశ్మీత్‌ సింగ్‌ తన కామిక్‌ చిత్రాల ద్వారా సిక్‌ కమ్యూనిటీ ప్రజల బాల్యపు గురుతుల్ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. తన బొమ్మల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిత్రకారుడి విశేషాలు...


మన చిన్నతనంలో అమ్మమ్మో, నానమ్మో తలకు నూనె రాసి, దువ్వడం, అలిగితే ముద్దుచేయడం మనందరికి జ్జాపకమే. అలానే తల్లితండ్రులు, తాతయ్యలు ఉయ్యాల మాదిరిగా మారి పిల్లల్ని ఊరడించడం ఇప్పటికి పంజాబ్‌లో చిన్నపిల్లలున్న ఇంట్లో కనిపించేదే. అక్కడి పిల్లలు ‘జూటీ మియా’ అంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు. ఈ మధుర స్మృతులను కామిక్‌లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు దశ్మీత్‌ సింగ్‌. 


పెయింటింగ్‌ మీద వ్యాపకంతో

‘‘ఆర్టిస్ట్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ గీసిన చిత్రాలను ఫేస్‌బుక్‌లో చూసి, ఆయన స్ఫూర్తితో పదకొండో తరగతిలో ఉన్నప్పటి నుంచే బొమ్మలు గీసేవాణ్ణి. నా ఆలోచనల్ని అందమైన బొమ్మలుగా వేయడం చూసి నాకే ఆశ్చర్యం వేసేది. ప్లస్‌టూ తరువాత మెడికల్‌ సైన్సె్‌సలో చేరాను. కానీ బొమ్మలేసే అలవాటు మాత్రం మానలేదు. ఖాళీ సమయంలో స్కెచ్‌లు, పెయింటింగ్స్‌ చక్కగా వేయడం నేర్చుకునేందుకు యూట్యుబ్‌ ట్యుటోరియల్స్‌ చూసేవాణ్ణి. అంతేకాదు ఫైన్‌ఆర్ట్‌ చేసిన మా అమ్మను పెయింటింగ్‌ బేసిక్స్‌ చెప్పమని అడిగేవాణ్ణి. చిత్రలేఖనం మీది వ్యాపకంతో చదువులో మార్కులు తక్కువగా వచ్చేవి. మెడికల్‌ సైన్స్‌ నాకు సరిపోదనిపించింది. దాంతో ఆ కోర్సు వదిలేసి ‘గురు తేజ్‌ బహదూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో చేరాను. అదేసమయంలో ‘అకల్‌ నెట్‌వర్క్‌’ అనే ఎన్జీవోతో పనిచేసే అవకాశం 


వచ్చింది. వారికోసం కొన్ని డిజిటల్‌ పెయింటింగ్స్‌ వేసి ఇచ్చాను. అలానే సిక్కు కమ్యూనిటీ కథల మీద చాలా బొమ్మలు వేశాను. నా జీవితంలో ఏ రోజుకారోజు జరిగిన సంఘటనల్ని బొమ్మలుగా వేయడం నాకు అలవాటు. అయితే ఎక్కువ బొమ్మలు వేయడం సాధ్యమయ్యేది కాదు. దాంతో రఫ్‌గా స్కెచ్‌లు వేసేవాణ్ణి. పెయింటింగ్స్‌లో వేగం పెంచుకునేందుకు మెట్రోలో వెళ్లే వారిని, ఎవరి పనుల్లో వారున్న జనాల చిత్రాలు గీసేవాణ్ణి. 


తమను తాము చూసుకునేలా

ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అలీసియా సౌజా గీసిన బొమ్మలు చూశా. ఆమె తన జీవితం గురించి కామిక్స్‌ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చెబుతుంది. నేనూ అలా చేయాలనుకున్నా. నేను మొహమాటస్తుడిని. నా విషయాల్ని ఇతరులతో పంచుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడే  అందరి జీవితంలో రోజూ జరిగే సంఘటనల్ని కామిక్స్‌గా మలచాలన్న ఆలోచన వచ్చింది. వాటిని మొదటిసారి చూసిన వాళ్లు ‘అది నేనే’ అని తమను తాము పోల్చుకుంటారు. నేను ఎక్కువగా ఊహాత్మక, జీవిత వాస్తవాలనే కామిక్స్‌గా వేస్తా’’ అని చెబుతాడీ ఆర్టిస్ట్‌.


సిక్కు పెద్దలు ప్రశంసించారు

‘‘నా కామిక్స్‌ చూసి సిక్కు పెద్దలు, ఇతర మతాల వాళ్లు కూడా నన్ను అభినందించారు. ఎవరైనా నా కామిక్స్‌ను షేర్‌ చేసి ‘ఇది నేనే’ అని చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ‘మాకు ఇబ్బందిగా గడిచిన రోజున మీ కామిక్స్‌ చూసి నవ్వుతూ బాధల్ని మరిచిపోతున్నాం’ అని చాలామంది నాకు సందేశాలు పంపిస్తుంటే చెప్పలేనంత ఆనందం వేస్తుంది.’’

Updated Date - 2020-03-14T06:32:24+05:30 IST