కమ్‌ వాట్‌ మే

ABN , First Publish Date - 2022-04-17T07:05:48+05:30 IST

రమణా.. ఓ జస్టిస్‌.. చీఫ్‌ జస్టిస్‌.. నువ్వు మాట్లాడుతుంటే అందరికీ న్యాయం పంచిపెడుతున్నట్లుంది ఎండిపోతున్న అస్తిత్వ గొంతుకల...

కమ్‌ వాట్‌ మే

రమణా.. ఓ జస్టిస్‌.. చీఫ్‌ జస్టిస్‌..

నువ్వు మాట్లాడుతుంటే

అందరికీ న్యాయం పంచిపెడుతున్నట్లుంది

ఎండిపోతున్న అస్తిత్వ గొంతుకల

    దప్పిక తీర్చినట్లుంది

తిరగబడ్డ ధర్మకాటాను నిలబెట్టినట్లుంది

రమణా నిన్ను చూస్తే

నాలుగో సింహం కనిపించినట్లుంది

పేదోని చెంతకు న్యాయాన్ని తీస్కపోయేందుకు

నువ్వెన్ని విప్లవాలనైనా ప్రేరేపించు

జస్టిస్‌ ఓ జస్టిస్‌

శిలువెక్కించిన న్యాయానికి

నువ్వు చికిత్స చేస్తున్నావ్‌

అవును

గండిపేట నీళ్లు తాగినోడివి

అందుకే గండర గండడు లాంటి తీర్పులిస్తావ్‌

సిద్దయ్య క్యాంటిన్‌లో చాయ్‌ తాగినోడివి

కనుకే న్యాయం పట్ల నీకంత నిబద్ధత

గంగా జమునా తెహజీబ్‌ 

      సంస్కృతి జెండానే ఎత్తుతావ్‌

జస్టిస్‌...కాలమెప్పుడూ

మూగజీవాల కోసం గొంతువిప్పే 

        వాళ్ల కోసమే ఎదురు చూస్తది

ఇప్పుడు నువ్వొక గొంతుక వయ్యావ్‌

నీ తీర్పు నీ మాట 

అణచిపెట్టుకున్న గొంతులోంచి

పెళ్లుబికిన పెనుకేక

రమణా... ఓ జస్టిస్‌...

నువ్వు తెలుగు బిడ్డవు

తెలంగాణ దువ్వలో తిరిగినోడివి

సమధర్మం కోసం తీర్పునిచ్చిపోతున్న నిన్ను చూస్తే

న్యాయం కోసం గొంతు విప్పిన 

        ప్రపంచం కనిపిస్తుంది

జస్టిస్‌... ఓ జస్టిస్‌...

మళ్లీ గొంతు విప్పే రమణ కోసం

ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న 

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కన్నుమూసిన

కళ్లవైపే ప్రపంచం చూపు

కమ్‌ వాట్‌ మే

ఎహేయ్‌ ఏమన్నా కానీ

అనాల్సిన మాటలు అనేసినవ్‌

ఇక రాయాల్సిన రాతలు రాసేయ్‌...

జూలూరు గౌరీశంకర్‌

Updated Date - 2022-04-17T07:05:48+05:30 IST