అవినీతి అధికారులకు డిమాండ్‌

ABN , First Publish Date - 2022-06-16T06:53:05+05:30 IST

జిల్లాలోని ఓ తహసీల్దార్‌కు ఫుల్‌ డిమాండ్‌. ఆయన ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.

అవినీతి అధికారులకు డిమాండ్‌

మా ఊరికి రా సార్‌!

ఓ తహసీల్దారుకు యమ క్రేజ్‌

చిటికె వేస్తే.. వాలిపోతాడట.. 

ఆ ముగ్గురిని వదిలించుకునే యత్నం

రెవెన్యూ ఉన్నతాధికారుల ఆలోచన


జిల్లాలోని ఓ తహసీల్దార్‌కు ఫుల్‌ డిమాండ్‌. ఆయన ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. డీ పట్టాలను మ్యుటేషన పేరిట మాయచేసి పట్టాలు సృష్టించి, రూ.కోట్లు దండుకున్న ఘనుడు. ఈ నెల 17లోపు ప్రభుత్వ శాఖలో సాధారణ బదిలీలు జరుగుతాయి. ఒక చోట ఐదేళ్లు పని చేసినవారు తప్పనిసరిగా బదిలీ అవ్వాలి. కానీ కొందరు అర్హత లేకపోయినా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఇతర మండలాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 


అనంతపురం క్రైం

అనంతపురం రెవెన్యూ డివిజన పరిధిలో ఉన్న ముగ్గురు తహసీల్దార్ల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఇద్దరికి జిల్లాలో ఎక్కడా ప్లేస్‌మెంట్‌ ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. మరొకరిని అనంతపురం డివిజన నుంచి బయటకు పంపించాలని నిర్ణయించారు. కోరుకున్న మండలానికి వెళ్లేందుకు కొందరు తహసీల్దార్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. సిఫార్సు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని అంటున్నారు. అక్రమార్కులను దూరం పంపాలని భావిస్తున్న అధికారులు అనుకున్నది జరుగుతుందా..?నేతల సిఫార్సులు పనిచేస్తాయా..? అన్న చర్చ జరుగుతోంది. 


ఇలాంటి వారూ ఉంటారా..?

ప్రపంచ విజేత పేరు పెట్టుకున్న ఓ తహసీల్దారు నిజాయితీ గురించి అధికారుల మధ్య ప్రస్తావన వచ్చిందట. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న ఆ తహసీల్దారును తాడిపత్రి మండలానికి ఇనచార్జిగా వెళ్లాలని ఉన్నతాధికారులు కోరారట. అయితే, తాను పెట్రోలు ఖర్చులు భరించలేనని ఆయన అన్నారట. ‘ఇనచార్జ్‌ ఇస్తే చాలు.. దున్ని పడేద్దాం..’ అనుకునే ఈ రోజుల్లో ఆయనలాంటి తహసీల్దార్లు కూడా ఉన్నారా..? అని అధికారులు ఆశ్చర్యపోయారట. ‘కావాలంటే బదిలీ చేసుకోండి. ఒత్తిడి చేసి అక్రమంగా పనులు చేయించుకోవాలంటే కుదరదు’ అని నాయకులకు ఆయన సూటిగా చెప్పేస్తారని సమాచారం. 


పోస్టింగుల కోసం..

తహసీల్దార్‌ పోస్టింగుల కోసం సిఫార్సుల ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. కోరిన మండలానికి నియమించాలని కొందరు తహసీల్దార్లు అధికారపార్టీ ప్రజాప్రతినిధులను కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉన్న అనంతపురం తహసీల్దారుగా ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతమున్న తహసీల్దారు బుక్కరాయసముద్రానికి బదిలీ అవుతారని, ఆ స్థానంలో ఇదివరకు తాడిపత్రిలో పనిచేసి, సెలవులో ఉన్న అధికారి వస్తారనే ప్రచారం జరుగుతోంది. మరో పది మండలాలకు తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. 


ఆయనకు ఫుల్‌ డిమాండ్‌

అవును..! ఆ తహసీల్దార్‌కు ఫుల్‌ డిమాండ్‌. ఆయన వస్తానంటే.. జిల్లాలోని కొన్ని మండలాలు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయట. అధికార పార్టీవారు చెప్పిందే వేదంగా అమలు చేస్తారని, అందుకే ఆయన కోసం కొందరు నాయకులు పరితపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న మండలంలో.. అధికార పార్టీ నాయకుడి తనయుడు పిలిచిందే తడవు రికార్డులతో ప్రత్యక్షమౌతారట. అవసరమైతే వీఆర్వోను వెంటబెట్టుకుని మరీ ఆయన ముందు వాలిపోతారట. ఓ మహిళ పేరిట ఉన్న 12 ఎకరాలను మరో  మహిళ పేరిట రిజిస్ట్రేషన చేయించారు. దీనికోసం నకిలీ ఆధార్‌కార్డు సృష్టించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం వివాదంలో ఉంది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని ఆ కీలక యువనేత  బాగా ట్రై చేస్తున్నాడట. దీనికోసం ఆ తహసీల్దారును అక్కడే ఉంచాలని ఒత్తిడి తెస్తున్నాడట. విధుల్లో చేరిన కొన్ని నెలల్లోనే డీ పట్టాలను మరొకరి పేరిట పట్టాలుగా మార్చిన ఆ అధికారి కోసం తాడిపత్రి వైసీపీ నాయకులు పరితపిస్తున్నారట. ‘మా నియోజకవర్గంలో ఏదో ఒక మండలానికి రండి’ అని ఆయనకు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. పలు మండలాల నాయకులు ఆయనే కావాలని కొందరు ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేయిస్తున్నట్లు తెలిసింది. కొందరు అవినీతి తహసీల్దార్లకు ఇదే స్థాయిలో డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 


ఆ ముగ్గురికి ‘లెక్క’రాని సీట్లు..?

‘లెక్క’రాని సీట్లంటే.. అవినీతికి ఆస్కారం లేని కుర్చీలు. రెవె న్యూ విభాగంలో అలాంటి సీటు వెతకాలంటే కష్టం కావచ్చు. కానీ ఓ ముగ్గురు తహసీల్దార్ల విషయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇదే ఆలోచిస్తున్నారట. ఆ ముగ్గురులో ఇద్దరిని జిల్లాలో ఎక్కడా నియమించకూడదనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరో తహసీల్దారును ప్రస్తుతం పనిచేస్తున్న డివిజన పరిధిలో ఎక్కడా నియమించకూడదనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పనిచేస్తున్న ఈ ముగ్గురిపై ఉన్నతాధికారులు ఇలా వేటు వేయనునున్నట్లు తెలిసింది. ముగ్గురూ అవినీతిలో బాగా ఆరితేరడమే ఇందుకు ప్రధాన కారణం. వీరిలో ఓ మేడం ఉండటం గమనార్హం. కానీ, అవినీతి అధికారులకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో.. ఉన్నతాధికారుల ఆలోచనను అమలు కానిస్తారా..? అన్నది సందేహమే.

Updated Date - 2022-06-16T06:53:05+05:30 IST