Abn logo
Sep 22 2021 @ 00:38AM

నెలకు ఒకసారి హుజూరాబాద్‌కు వస్తా

సమావేశంలో మాట్లాడతున్న మంత్రి హరీష్‌రావు

-  ఇచ్చిన హామీల పనులు పర్యవేక్షిస్తాం

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 

జమ్మికుంట, సెప్టెంబరు 21: ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ప్రతి నెలకు ఒక సారి హుజూరాబాద్‌కు వస్తా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో మోత్కులగూడెంకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ నెలకు ఒకసారి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో వచ్చి ఇచ్చిన హామీల పనులు ఎంత వరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయని పర్యవేక్షిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ఊరు మీది మోరి నీళ్లు అన్ని నాయిని చెరువులో కలిసేవని, మహిళలు అందులోనే బతుకమ్మలు నిమజ్జనం చేసేవారన్నారు. ఇప్పుడు కోటి యాభై లక్షలు వెచ్చించి మోరి నీళ్లు నాయిని చెరువులో కలవకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. బతుకమ్మలు, వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కోసం ఫ్లాట్‌ ఫామ్‌లు నిర్మిస్తామన్నారు. మోత్కులగూడెంకు 300 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సిలిండర్‌ను గుర్తు చేసుకోవాలని, అప్పుడు మీ వేలు నేరుగా కారు గుర్తు మీదకు వెళ్తుందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ లేదని, టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ చేతుల్లో పెడుతోందని, రిజర్వేషన్లను కూడా ఎత్తి వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షా యాభై వేల ఉద్యోగాలు ఇస్తే, బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోందన్నారు. ప్రజల మీద పన్నుల భారం వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నా రన్నారు. సిలిండర్‌ ధరను ఐదు వందల రూపాయలకు తగ్గించి బీజేపీ వాళ్లు ఓటు అడగాలన్నారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులు పంచుతున్నారని చెబుతూ బీజేపీ వాళ్లే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి దిక్కులేదని, ఐటీఐఆర్‌ను రద్దు చేసిన ఘనత కేంద్రానిది కాదా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను ఆరు సార్లు గెలిపించారని, మరో రెండు సంవత్సరాలు అధికారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని, గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్క రూపాయితో ఫోన్‌ చేస్తే వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడని తెలిపారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లాడన్నారు. రెండు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఇక్కడ ఒక్క మహిళ భవనాన్ని కూడా కట్టించలేదన్నారు. ఇప్పుడు 60 కోట్ల నిధులతో జమ్మికుంటలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని ఇచ్చే పార్టీ టీఆర్‌ఎస్‌ అయితే, అన్ని గుంజుకునే పార్టీ బీజేపీ అని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, కోరుకంటి చందర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొనగంటి సంపత్‌, పొనగంటి మల్లయ్య, దేశిని కోటి, తుమ్మేటి సమ్మిరెడ్డి, టంగుటూరి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.