యాదాద్రికి రండి

ABN , First Publish Date - 2021-09-04T08:13:24+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు.

యాదాద్రికి రండి

  • అక్టోబరు, నవంబరుల్లో ప్రారంభోత్సవం.. 
  • ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌
  • సానుకూలంగా స్పందించిన నరేంద్ర మోదీ
  • ఢిల్లీలో తెలంగాణ భవన్‌ స్థలానికీ అంగీకారం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని కీలక హామీలు
  • 2 పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయండి
  • మరో 21 నవోదయ విద్యాలయాలు ఇవ్వండి
  • కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్లో ఐఐఎం
  • టెక్స్‌టైల్‌ పార్క్‌కు వెయ్యి కోట్లివ్వండి.. 
  • ఐపీఎస్‌ పోస్టులను 195కు పెంచండి
  • ప్రధానికి పది డిమాండ్లతో కేసీఆర్‌ వినతి పత్రం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. అక్టోబరు, నవంబరు మాసాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అత్యద్భుత స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తాను చేపడుతున్న యాదాద్రి నిర్మాణం గురించి మోదీకి వివరించడమే కాకుండా అనేక చిత్రాలను చూపినట్లు తెలిసింది. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. యాదాద్రి ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.


టీఆర్‌ఎస్‌ భవన్‌ శంకుస్థాపనకు గురువారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌.. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని సమస్యలపై 10 వినతి పత్రాలను ప్రధానికి అందజేశారు. ముఖ్యంగా ఐపీఎస్‌ పోస్టులపై సమీక్ష, సమీకృత టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, జవహర్‌ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, పీఎంజీఎ్‌సవై కింద అదనపు నిధుల మంజూరు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో రహదారుల పనులు, పీఎంజీఎ్‌సవై స్థాయిలను పెంచడం, కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ మంజూరు, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తదితరాలు వాటిలో ఉన్నాయి. ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైనందున అధికారిక తెలంగాణ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని.. స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.


పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయండి

రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. మొత్తం 585 కి.మీ హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌తోపాటు హైదరాబాద్‌-వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌ స్థాయిలో హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ల్లో రెండు టెర్మినల్స్‌ ఏర్పాటవుతాయని వివరించారు. ఈ రెండు నగరాలను అంతర్జాతీయ కార్గో హబ్‌లుగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మధ్య హైస్పీడ్‌ రైలు కనెక్టివిటీని, ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రతిపాదించారని, వీటి మధ్య ఆరు/ఎనిమిది లేన్ల 44వ నంబర్‌ జాతీయ రహదారి కూడా ఉందని తెలిపారు. కారిడార్‌ ఏర్పాటుతో రోడ్డు, రైలు మార్గాలకు ఇరువైపులా దాదాపు 50 కి.మీ వరకు ప్రభావశీల ప్రాంతంగా ఉంటుందని, ఇండస్ట్రియల్‌ టౌన్‌షి్‌పలు, లాజిస్టిక్‌ హబ్‌లు ఏర్పాటవుతాయని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని 27 శాతం జనాభా అంటే, దాదాపు 4 కోట్ల మందిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఉత్తర తెలంగాణకు ప్రధానమైన ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉన్న కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేయాలని ప్రధానిని కేసీఆర్‌ కోరారు. పీపీపీ పద్ధతిలో కేంద్ర విద్యా శాఖ ట్రిపుల్‌ ఐటీలను మంజూరు చేస్తోందని, ఇప్పటికే హైదరాబాద్‌ చుట్టూ సాంకేతిక విద్యా సంస్థలు విస్తరించి ఉన్నాయని, అందుకే, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేయతలపెట్టామని వివరించారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని, పీపీపీ పద్ధతిలో చేపట్టడానికి అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలంటూ ఐటీ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామన్నారు.


నవోదయ విద్యాలయాలు ఇవ్వండి

రాష్ట్రంలోని 21 జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోనే ఇవి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఉండాలని, అందుకే, మిగతా 21 జిల్లాలకు కూడా మంజూరు చేయాలని కోరారు. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయిస్తామని తెలిపారు.


ఐపీఎస్‌ పోస్టులను 195కు పెంచండి

రాష్ట్రానికి మంజూరైన ఐపీఎస్‌ పోస్టులను మరోసారి సమీక్షించి వాటిని 195కు పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరారు. గతంలో రెండు పోలీసు కమిషనరేట్లు, తొమ్మిది పోలీసు జిల్లాలు ఉండేవని, కొత్త జిల్లాల ఏర్పాటుతో 20 పోలీసు జిల్లాలు, తొమ్మిది కమిషనరేట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. వీటికి వివిధ కేడర్లలో ఐపీఎస్‌ అధికారులు అవసరమవుతారని వివరించారు. ఈ దృష్ట్యా ఐపీఎ్‌సల కేడర్‌ స్ట్రెంథ్‌ను మరోసారి సమీక్షించాలని కోరారు. ఈ మేరకు 2021 జూన్‌ 24న కేంద్రానికి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.


గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రగతి లేదని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సెంట్రల్‌ యూనివర్సిటీగా దీనిని ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. ఇప్పటికే వరంగల్‌ సమీపంలో 200 ఎకరాలను గుర్తించామని, కేంద్రం నుంచి వచ్చిన బృందం స్థలానికి ఆమోదం తెలిపిందని తెలిపారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర విద్యా శాఖను ఆదేశించాలని కోరారు.


వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు పూర్తిస్థాయి నిధులివ్వాలి

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో (ఎల్‌డబ్ల్యూఈ) రోడ్ల అభివృద్ధి కార్యక్రమం కింద రాష్ట్రానికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలని కేసీఆర్‌ కోరారు. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో నిధులను సమకూర్చాల్సి వస్తోందని, కానీ, దీనిని కేంద్ర సౌజన్య పథకాల (సీఎ్‌సఎస్‌) జాబితాలో కేంద్రం చూపుతోందని తెలిపారు. రాష్ట్రాలపై ఎలాంటి భారం మోపకుండా కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులను భరించాలని కోరారు. కాగా.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రాష్ట్రానికి 4000 కిలో మీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు రోడ్ల అనుసంధానాన్ని పెంచుతామంటూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ.. ఈ రోడ్ల కనెక్టివిటీ హామీ తమ పరిధిలోకి రాదంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలిపిందని వివరించారు. ఈ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అదనపు నిధులు ఇప్పించాలని కోరారు.


వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు రూ.1000 కోట్లు ఇవ్వండి

వరంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్రం నుంచి ‘వన్‌టైమ్‌ గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌’ కింద రూ.1000 కోట్లను మంజూరు చేయాలని ప్రధానిని కేసీఆర్‌ కోరారు. ‘‘టెక్స్‌టైల్‌, అపెరల్‌ రంగంలో మీరు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు సంతోషాన్నిచ్చాయి. దేశంలోనే పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ టెక్స్‌టైల్‌ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆస్కారముంది. వరంగల్‌లో 2000 ఎకరాల్లో సమీకృత టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 1000 ఎకరాలు సేకరించాం. మిగతా 1000 ఎకరాలను సేకరించే పనిలో ఉన్నాం. పార్కును ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే రూ.1600 కోట్లు అవసరమవుతాయి. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లు ఇవ్వండి. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది’’ అని కోరారు.


హైదరాబాద్‌కూ ఐఐఎం

గత పదేళ్లలో పలు రాష్ట్రాలకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లను మంజూరు చేశారని, కానీ, తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని ప్రధానికి కేసీఆర్‌ వివరించారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐఎంను కేంద్రం ఇస్తోందని, తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో ఐఎ్‌సబీ ఉందన్న కారణంతో ఐఐఎంను ఇవ్వడం లేదని, ఐఎ్‌సబీ లాంటి ఖరీదైన స్కూల్‌లో అత్యధిక ట్యూషన్‌ ఫీజులు చెల్లించి సాధారణ విద్యార్థులు చదవలేరని వివరించారు. అందుకే హైదరాబాద్‌కు ఐఐఎంను మంజూరు చేయాలని, ఇందుకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆవరణలో స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు.


అడిగిన ఒక్క రోజులోనే అపాయింట్‌మెంట్‌

దాదాపు 8 నెలల తర్వాత ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌ శంకు స్థాపనకు గురువారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌కు మర్నాడే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ లభించడం గమనార్హం. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని, ప్రధానిని ముఖ్యమంత్రులు కలుసుకోవడం మామూలేనని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించినప్పటికీ... కేసీఆర్‌, మోదీ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రస్థాయిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ హోరాహోరీ తలపడుతున్నా.. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యర్థి తామేనని బీజేపీ అంటున్నా.. ఇటీవల పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు సృష్టించిన గందరగోళంలో టీఆర్‌ఎస్‌ భాగస్వామి కాకపోవడాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నా యి. ప్రతిపక్షాల ఐక్య కార్యాచరణలో పాల్పంచుకోకపోవడం ద్వారా కేంద్రం లో బీజేపీకి ప్రత్యర్థులం కామన్న సంకేతాలు పంపినట్లయిందని, అందువల్లే మోదీ-కేసీఆర్‌ భేటీ సులభంగా సాధ్యపడిందని విశ్లేషిస్తున్నాయి. వారిరువురూ దేశ రాజకీయాలపై చర్చించినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2021-09-04T08:13:24+05:30 IST