వచ్చామా.. పోయామా!

ABN , First Publish Date - 2021-12-04T06:15:09+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా అవి అస్తవ్యస్తంగానే నడుస్తున్నాయి.

వచ్చామా.. పోయామా!
వెలిగండ్ల సచివాలయంలో ఉదయం 10.40 గంటలకు కూడా ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

అస్తవ్యస్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు 

రెండేళ్లు దాటినా గాడిన పడని వ్యవస్థ

ఉద్యోగుల ఇష్టారాజ్యం.. సేవలు నామమాత్రం

వేళకు రారు... వచ్చినా అందుబాటులో ఉండరు

బయోమెట్రిక్‌ హాజరు ఫలితం అంతంతమాత్రమే

ఫీల్డ్‌ వర్క్‌ పేరుతో వెళ్లిపోయే వారే అధికం

వ్యవస్థపై విశ్వాసం లేక పెద్దగా రాని ప్రజలు

వచ్చిన వారికీ సమాధానం చెప్పేవారు కరువు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో తేటతెల్లం

వేళకు రారు...వచ్చినా అందుబాటులో ఉండరు. బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తున్నా ఆలస్యంగా వచ్చి వేలిముద్ర వేసి ఫీల్డ్‌ పేరుతో వెళ్లిపోతారు. ఎవరు ఏ పనిపై వెళ్తున్నది మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో స్పష్టంగా రాయరు. సమన్వయం చేయాల్సిన సెక్రటరీలు, డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది అసలు కనిపించరు. వారు ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఎక్కువ మంది సిబ్బంది.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వచ్చే సర్వేలు, ఇతర పనులపై ఫీల్డ్‌లో ఉన్నట్లు అక్కడికి వెళ్లిన వారికి చెప్తుంటారు. ఇదీ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల పరిస్థితి. అందుకే ప్రజలు కూడా పనుల కోసం పెద్దగా వాటి వద్దకు వెళ్లడం లేదు. కొందరు వెళ్లినా వారికి కూడా సరైన సమాధానం చెప్పేవారు, పనులు చేసేవారు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. నిత్యం ఉన్నతాధికారులు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నా పెద్దగా వాటి పనితీరులో మార్పు కనిపించడం లేదు. ఇదే విషయం శుక్రవారం జిల్లాలో ‘ఆంధ్రజ్యోతి’ బృందం నిర్వహించిన సచివాలయాల విజిట్‌లో మరోసారి తేటతెల్లమైంది.


ఒంగోలు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా అవి అస్తవ్యస్తంగానే నడుస్తున్నాయి. ఏమాత్రం గాడినపడిన పరిస్థితి లేకపోగా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబరు 2 నుంచి సచివాలయ వ్యవస్థను తెచ్చింది. జిల్లాలోని గ్రామీణ ప్రాతాల్లో 884, అర్బన్‌ ప్రాంతాల్లో 174 వెరసి 1,058 సచివాలయాలను ఏర్పాటు చేశారు. అర్బన్‌లో 10 మంది, రూరల్‌లో 14మంది సిబ్బందిని ఇవ్వగా ప్రస్తుతం 9,756 మంది పనిచేస్తున్నారు. వారికి అనుబంధంగా  17,954 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, సంక్షేమ, పోలీస్‌ తదితర కీలక శాఖలకు సంబంధించిన పనులు సత్వరం ప్రజలకు అందాలని ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. నెలనెలా కోట్లాది రూపాయల జీతాలు, నిర్వహణ ఖర్చులు పెడుతున్నారు. అయితే రెండేళ్లు గడిచినా వ్యవస్థ సక్రమంగా నడవడం లేదు. దీంతో ప్రజలకు సేవలు మెరుగు పడలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. 


150 సచివాలయాల పరిశీలన

జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 150 సచివాలయాలను ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించగా ఉదయం 10.30కు వచ్చిన సిబ్బంది చాలా తక్కువగానే కనిపించారు. కొందరు 11 గంటలకు అటుఇటుగా వచ్చి బయోమెట్రిక్‌ వేస్తుండగా, మరికొన్నిచోట్ల 12 వరకూ వస్తూనే ఉన్నారు. వచ్చిన వారిలో ఎక్కువమంది ఓటీఎస్‌, ఓటర్ల సర్వే, ఇతర ఫీల్డ్‌వర్క్‌ పేరుతో బయటకు వెళ్లిపోతుండగా మూవ్‌మెంట్‌ రిజిస్టర్ల నిర్వహణ సరిలేదు. అడ్మిన్‌ సెక్రటరీలు, డిజిటల్‌ అసిస్టెంట్లు తప్ప మిగతా వారు పెద్దగా ఉండటం లేదు. దాదాపు 554 సేవలు ప్రజలకు అందాల్సి ఉన్నా పట్టుమని పదిరకాల పనులు కూడా జరుగుతున్న దాఖలాలు లేవు. ప్రజల నమ్మకాన్ని ఇంతవరకు ఈ వ్యవస్థ పొందలేదన్నది అక్కడికి ఎవరూ రాకపోవడాన్ని బట్టి తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పనుల కోసం వస్తున్న ఒకరిద్దరికి కూడా సకాలంలో అవి జరగక వలంటీర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. కాగా ఆంధ్రజ్యోతి బృందం విజిట్‌ సందర్భంగా తమకు పనులు జరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 


పింఛన్‌ మంజూరుకు తిప్పుతున్నారు

అద్దంకి పట్టణంలోని 7వ నెంబరు సచివాలయంలో షేక్‌ షిలార్‌బి అనే మహిళ పింఛన్‌ సమస్యపై ఏడాదిన్నరగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, సాంకేతిక కారణాలు చెప్పి తిప్పుతున్నారంటూ కార్యదర్శిని నిలదీయడం కనిపించింది. తాళ్లూరు మండలం మాధవరంలో డిజిటల్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు తప్ప ఎవ్వరూ  లేరు. ఎనిమిది మంది ఓటీఎస్‌ పని మీద వెళ్లారని చెప్పారు. కంభం మండలం కందులాపురం-3లో డిజిటల్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు మాత్రమే ఉండగా మిగతా వారు పని మీద వెళ్లారన్న సమాధానం వచ్చింది. పీసీపల్లి మండలం గుంటుపల్లి సచివాలయంలో 10.30కు కూడా సిబ్బంది రాలేదు. కురిచేడు సచివాలయానికి వలంటీర్లు పింఛన్‌ ఇవ్వలేదని వృద్ధులు రావడం కనిపించింది. గిద్దలూరు 9వ నెంబరు సచివాలయంలో ప్రజలకు పంపిణీ చేయకుండా ఉన్న చెత్త డబ్బాలు గుట్టలుగా పడి ఉన్నాయి. పుల్లలచెరువు మండలం నాయుడుపాలెంలో నెట్‌ కనెక్షన్‌ లేక హాట్‌స్పాట్‌తో పనిచేస్తుండగా అందులో జాప్యంతో పనులు సాగడం లేదు. సీఎస్‌పురంలోని 2వ నెంబరు సచివాలయ భవనానికి అద్దె కట్టకపోవడంతో యజమాని ఖాళీ చేయించాడు. దీంతో ఒకటి, రెండు కలిపి ఒకేచోట నిర్వహిస్తుండటంతో స్థలం చాలక సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు.


నియోజకవర్గాల వారీ సచివాలయాల్లో పరిస్థితి ఇదీ.. 

ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల పరిధిలో 15 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా ఒంగోలులో ఉన్నతాధికారులు అంతా ఉంటారు కనుక ఎక్కువశాతం 10.30కే తెరుచుకున్నాయి. అయితే సిబ్బంది హాజరు అంతంతమాత్రంగానే కనిపించింది. కార్పొరేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు అందుబాటులో ఉండటంతో ప్రజల రాక తక్కువగా ఉండగా వార్డు పరిధిలో తిరగాల్సిన అడ్మిన్‌ సెక్రటరీలు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. మిగతా సిబ్బంది వలంటీర్లకు పనులు అప్పజెప్పి సొంత పనులు చూసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని సచివాలయాల సిబ్బంది హాజరు వేసుకొని ఓటర్ల సర్వే, ఓటీఎస్‌ పేరుతో బయటకు వెళ్ళిపోగా, ఎన్‌జీపాడు మండలంలోని మద్దిరాలపాడు, చదలవాడ సచివాలయాల్లో  సిబ్బంది ఉన్నా ప్రజలు పెద్దగా పనులు కోసం వచ్చిన పరిస్థితి లేదు.  

 చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని మండలాల్లో 21 సచివాలయాలను విజిట్‌ చేయగా అత్యధిక చోట్ల సమయపాలన లేదు. ఎవరిష్టం వచ్చినప్పుడు వారు రావడం, బయెమెట్రిక్‌ వేసి ఫీల్డ్‌ పేరుతో వెళ్లిపోవడం కనిపించింది. ఎక్కువమంది హౌసింగ్‌ ఓటీఎస్‌ పనిమీద వెళ్లినట్లు చెప్తున్నారు. ఇక ప్రజలు కూడా పెద్దగా సచివాలయాలకు వస్తున్న పరిస్థితి లేదు.

 మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో 28 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా అధికచోట్ల సమయపాలన కనిపించ లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని  సిబ్బంది సమీప పట్టణాలైన మార్కాపురం, వైపాలెం, పొదిలిలలో నివాసముంటూ విధులకు ఆలస్యంగా వస్తున్నారు. పట్టణాల్లో అడ్మిన్‌ సెక్రటరీలు, గ్రామాల్లో కార్యదర్శు లు, డిజిటల్‌ అసిస్టెంట్లు తప్ప మిగతా సిబ్బంది హాజరు వేసుకొని వెళ్లిపోతుండగా చాలాచోట్ల జూని యర్‌ లైన్‌మెన్లు కనిపించలేదు. వీఆర్వోలు అధికు లు 8 కిలోమీటర్ల దూరంలోపు సచివాలయంలో బయోమెట్రిక్‌ నిబంధన ఉపయోగించుకొని మండల కేంద్రాలకు పరిమితం అవుతుండగా ఆఫ్‌లైన్‌ ఉండే నల్లమల ఆటవీ ప్రాంత గ్రామాల్లో అసలు సిబ్బంది కనిపించలేదు, చాలా గ్రామాల్లో సర్వర్లు పనిచేయక అవస్థలు పడుతున్నారు.

 కందుకూరు, కొండపి నియోజకవర్గాల పరిధిలో 20 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా ఎక్కడ చూసినా ఇద్దరు, ముగ్గురు తప్ప మిగతా వారు కనిపించడం లేదు. బయోమెట్రిక్‌ హాజరు ఉన్న ఆ  సమయంలోపు వచ్చి వేలిముద్ర వేసి ఏదో ఒక పని పేరుతో వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల హాజరు కోసం కూడా వస్తున్న పరిస్థితి లేదు. కందుకూరులోని మూడింటిలో అడ్మిన్‌ సెక్రటరీలు ఓటీఎస్‌ బిజీలో కనిపించగా మిగిలిన వాటిలో ఇద్దరు, ముగ్గురు తప్ప ఇతరులు కనిపించలేదు. లింగసముద్రంలోని సచివాలయంలో 11 నుంచి 12 గంటలలోపు సిబ్బంది వచ్చారు. వీవీపాలెం మండలం చుండిలో 11.30కు ఏఎన్‌ఎం ఒక్కరే రాగా అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వచ్చి ఆర్‌బీకేకు వెళ్లారు. కొండపి, సింగరాయకొండ మండలాల్లోనూ ఓటీఎస్‌ పనిపేరుతో సిబ్బంది బయటకు వెళ్లారు.

 కనిగిరి నియోజకవర్గంలోని 22 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా కనిగిరి పట్టణం మినహా ఇతర మండలాల్లో ఎక్కువశాతం సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు. వచ్చిన వారు కూడా పనుల కోసం వచ్చే ప్రజలు లేక ఖాళీగా ఉండగా కొందరు ఫీల్డ్‌ పనిపేరుతో వెళ్లిపోవడం కనిపించింది. గిద్దలూరు నియోజకవర్గంలో పది సచివాలయాల్లో  విజిట్‌ నిర్వహించగా సిబ్బంది సమయపాలన, హాజరు అంతంతమాత్రమే. వివిధ పనులు కోసం వచ్చి అర్జీలు ఇచ్చిన ఫలితం ఉండటం లేదని ప్రజలు అంటున్నారు. 

 అద్దంకి నియోజకవర్గ పరిధిలో 14 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా ఎక్కడా సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. వీఆర్వోలు అందుబాటులో లేకపోగా, ఇతర సిబ్బంది ఓటీఎస్‌ పేరుతో బయటకు వెళ్లినట్లు చెప్తున్నారు. సచివాలయాలకు ప్రజలు అంతగా రావడం లేదు. వచ్చిన వారు కూడా పనులు కావడం లేదని చెప్తున్నారు. 

 దర్శి నియోజకవర్గంలో 20 సచివాలయాల్లో విజిట్‌ నిర్వహించగా అధికశాతం సచివాలయాల్లో సిబ్బంది సకాలంలో రాని పరిస్థితి కనిపించింది. వచ్చిన హాజరు వేసుకొని ఓటీఎస్‌ అని ఫీల్డ్‌ వర్క్‌ అంటూ వెళ్లిపోయిన వారే అధికం. 








Updated Date - 2021-12-04T06:15:09+05:30 IST