ఉపాధ్యాయుడిగా వచ్చి...ఊరినే మార్చెేశడు

ABN , First Publish Date - 2021-08-04T06:09:06+05:30 IST

మారుమూల ఓ పల్లె. నీటికి కటకట. పంటలు పండక వ్యవసాయ కూలీలుగా పొరుగు ప్రాంతాలకు వెళ్లేవారు గ్రామస్తులు.

ఉపాధ్యాయుడిగా వచ్చి...ఊరినే మార్చెేశడు

మారుమూల ఓ పల్లె. నీటికి కటకట. పంటలు పండక వ్యవసాయ కూలీలుగా పొరుగు ప్రాంతాలకు వెళ్లేవారు గ్రామస్తులు. సరైన ఆదాయం లేక పెద్దలు... బడికి పోక పిల్లలు... పేరుకే ఊరు కానీ, అక్కడ బతుకు బండి నడవక ఎన్నో ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో ఆ పల్లె పాఠశాలకు వచ్చాడో ఉపాధ్యాయుడు. పచ్చదనం పరిచి... నీటి నిల్వలు పెంచి బడినే కాదు... ఆ ఊరినే మార్చేశాడు. అతడే భక్తరాజ్‌ గార్జే. 


‘కులాల్వాడీ... మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ప్రాంతం. 2010లో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా నా మొట్టమొదటి పోస్టింగ్‌ అక్కడే. కొత్త కొలువు. ఏదో సాధించేద్దామని ఉత్సాహంగా వెళ్లాను. బడిలోకి అడుగు పెట్టిన మరుక్షణమే నా ఆనందం ఆవిరైంది. శిథిలావస్థలో ఉన్న రెండు తరగతి గదులు. చదువుపై ఏ మాత్రం శ్రద్ధ లేని తొంభై ఏడు మంది విద్యార్థులు. ఏడాదిలో ఆరేడు నెలలు బడికి రారు. వాళ్లని మెరికల్లా తీర్చిదిద్దడం అటుంచితే... అసలు సిలబస్‌ పూర్తి చేయడమే కష్టమక్కడ. పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. పిల్లల్ని రోజూ బడికి రప్పించడానికి చేయని ప్రయత్నం లేదు. సౌమ్యంగా చెప్పాను. అభ్యర్థించాను. చాక్లెట్లు... బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపాను. ఫలితం శూన్యం. 


కారణం కనుగొని... 

పిల్లలు బడికి రాకపోవడానికి కారణం ఏమిటి? లోపం ఎక్కడ... ఎవరిలో ఉంది? ఊళ్లో వాకబు చేశాను. తెలిసిందేమిటంటే... కులాల్వాడీలో తీవ్ర నీటి ఎద్దడి. దాంతో భూములు బీడుబారిపోయాయి. వర్షాలకు లోటు లేకపోయినా వాన నీటిని పొదుపు చేసుకొనే కనీస ఏర్పాట్లంటూ లేవు. దానివల్ల వ్యవసాయం మందగించింది. పూట గడవడమే కష్టమైపోయింది. దీంతో వ్యవసాయ పనుల కోసం చుట్టుపక్కల గ్రామాలకు వలస వెళుతున్నారని తెలుసుకున్నాను. వారితోపాటు తమ పిల్లలను కూడా తీసుకువెళ్లేవారు. స్కూల్లో హాజరు తగ్గడానికి ప్రధాన కారణం అదే. మరి ఈ సమస్యకు పరిష్కారం? 


ఒక యజ్ఞంలా... 

ఊళ్లో విస్తృతంగా తిరిగి, అందరితో మాట్లాడిన తరువాత ఒక అవగాహనకు వచ్చాను. పచ్చదనం, నీటి నిల్వలు పెంచడమే సమస్యకు పరిష్కారంగా భావించాను. నేను వచ్చినప్పుడు పాఠశాల ప్రాంగణంలో ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఏడాదిలో అక్కడ వెయ్యికి పైగా మొక్కలు నాటించాను. వాటికి నీళ్లు పెట్టడం, కాపాడుకోడం... ఈ బాధ్యతను పిల్లలు, వారి తల్లితండ్రులకు అప్పగించాను. బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ స్వచ్ఛంద సంస్థ ‘పానీ ఫౌండేషన్‌’ వారి ‘వాటర్‌ కప్‌ కాంపిటీషన్‌’ ఊళ్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఎంతో ఉపయోగపడింది. నా అభ్యర్థన మేరకు ఫౌండేషన్‌ సభ్యులు వర్క్‌షా్‌పలు నిర్వహించి, గ్రామస్తులందరినీ అందులో పాల్గొనేలా ప్రోత్సహించారు. వాన నీటి సంరక్షణవల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. 


పదేళ్ల పరిశ్రమ... 

పర్యావరణ పరిరక్షణకు నేను సూచించిన మార్గంలో నడవడానికి గామ్రస్తులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చారు. నేను తలపెట్టిన మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు. చందాలతో వాన నీటి సంరక్షణ, కాలువలు, చిన్న చిన్న చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. మా కృషి ఫలించింది. పదేళ్ల పరిశ్రమకు ఫలితంగా నేడు గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. ఒకప్పుడు చుక్క నీరు కూడా దొరకని ప్రాంతం ఇప్పుడు 23 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసుకొనే స్థాయికి చేరింది. ప్రతి వర్షపు బొట్టూ ఒడిసి పట్టేలా ప్రణాళికాబద్దంగా వనరులు సమకూర్చుకోగలిగాం. భూగర్భ జలాలు పెరిగాయి. గ్రామస్తులతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించడంవల్లే ఇది సాధ్యమైంది. 


పండ్లు... కూరగాయలు... 

సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడంతో గుట్టలుగా ఉన్న నేలను వ్యవసాయ యోగ్యంగా చేసి పండ్లు, కూరగాయల మొక్కలు నాటాం. అవి ఇప్పుడు స్థానికులకు ఆదాయ వనరులుగా మారాయి. ఒకప్పుడు కూలి పని కోసం వలస వెళ్లేవారు నేడు పుట్టిన ఊళ్లోనే వినూత్న పద్ధతుల్లో సాగు చేసుకొంటున్నారు. సొంతంగా చేసిన సేంద్రియ ఎరువులు వాడడంవల్ల కలుషితం కాని స్వచ్ఛమైన పండ్లు, కాయగూరలు పండించగలుగుతున్నారు. నేడు గ్రామంలో 25 వేల పండ్ల చెట్లు ఉన్నాయంటే అది ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. 


విద్యార్థులు రెట్టింపు...

ఈ యజ్ఞం ఎక్కడ మొదలైనా... ఏ మలుపు తీసుకున్నా... అంతిమ లక్ష్యం ఊళ్లో పిల్లలందరూ బడికి రావాలనేదే! సమస్యను మూలాల్లోకి వెళ్లి పరిష్కరించడంవల్ల కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందో చెప్పడానికి కులాల్వాడీకి మించిన నిదర్శనం మరొకటి అక్కర్లేదేమో. నాటిన మొక్కలు జీవనోపాధికి మార్గాలయ్యాయి. జల సంరక్షణ చర్యలతో సాగు పెరిగి పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. దీంతో పిల్లలు బడికి వచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. నేను స్కూల్లో అడుగుపెట్టినప్పుడు వంద లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 250కి చేరింది. ఎప్పుడూ లేనంతగా హాజరు శాతం నమోదవుతోంది. నా సంకల్పానికి గ్రామస్తుల ప్రయత్నం తోడైంది. అందుకే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 

Updated Date - 2021-08-04T06:09:06+05:30 IST