Jun 18 2021 @ 22:54PM

జట్టు కట్టారు హిట్టు కొట్టారు!

ఏ రంగంలోనయినా ఇద్దరు గొప్ప వ్యక్తుల కలయిక ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో  మంచి కాంబినేషన్‌ సెట్‌ అయితే,  సగం విజయం సాధించినట్టేనని భావిస్తారు. అయితే చిత్ర పరిశ్రమలో ఒకే విభాగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలసి రాణించడం అరుదనే చెప్పాలి. కాకపోతే ప్రస్తుతం రచన,  సంగీతం, దర్శకత్వం, ఫైట్స్‌  లాంటి విభాగాల్లో ఇద్దరు వ్యక్తులు కలసి పనిచేస్తూ  చిత్ర పరిశ్రమలో తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. సినిమా రంగంలోని కొన్ని విభాగాల్లో ఘన విజయాలు అందుకుంటున్న జంటలు ఇవే.


ఇద్దరూ కలసి ఎదిగారు


ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది అనే మాట రాజ్‌, డీకే దర్శకద్వయానికి చక్కగా సరిపోతుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ కూడా సూపర్‌ హిట్టవడంతో వీరిద్దరి కాంబోకు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. తిరుపతికి చెందిన రాజ్‌, డీకే తొలుత అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా  పనిచేశారు. సినిమాపై ఫ్యాషన్‌తో 2003లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇద్దరూ కలసి దర్శకులుగా ‘ప్లేవర్స్‌’ అనే రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని రూపొందించారు. అప్పటి నుంచి  ఇద్దరూ  చిత్ర రచన, నిర్మాణం, దర్శకత్వ విభాగాల్లో తమ సత్తా చాటుతూ పలు విజయాలు అందుకున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ‘99’, ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’,  జాంబీ జానర్‌లో తెరకెక్కిన ‘గో గోవా గాన్‌’, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీ్‌సతో దర్శకులుగా ఘన విజయాలను అందుకున్నారు. ‘స్త్రీ’ చిత్రంతో బాలీవుడ్‌లో నిర్మాతలుగానూ కమర్షియల్‌ విజయాన్ని సొంతం  చేసుకున్నారు. సొంత బేనర్‌ డీ2ఆర్‌లో తెలుగులో నిర్మించిన ‘సినిమా బండి’ ఈ ఏడాదే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రాజ్‌, డీకే ద్వయం  షాహిద్‌కపూర్‌, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో వెబ్‌సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. 


హిట్‌ పెయిర్‌


భార్యభర్తలుగా జీవితాన్నే కాదు దర్శకులుగా సినీ కెరీర్‌ను కలసి పంచుకుంటున్నారు పుష్కర్‌-గాయత్రి దంపతులు. సినిమాపై ఉన్న ఆసక్తి ఇద్దరినీ దర్శకత్వం వైపు అడుగులు వేసేలా చేసింది. భార్యభర్తలు   కలసి దర్శకులుగా పని చేస్తున్న ఘనత ఆసియా ఖండంలో వీరికే దక్కుతుంది.  2007లో ఆర్య కథానాయకుడిగా ‘ఓరమ్‌ పో’ (తెలుగులో - నేను ఆటోవాణ్ణి) అనే తమిళ చిత్రంతో ఈ జంట దర్శకులుగా పరిచయమయ్యారు. ఆటో రేస్‌ల నేపథ్యంలో సాగే ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఎస్పీ చరణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వా’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్‌ వేధ’ చిత్రం ఘన విజయం సాదించడంతో పుష్కర్‌-గాయత్రి జంటకు దర్శకులుగా స్టార్‌డమ్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని సైఫ్‌ అలీఖాన్‌, హృతిక్‌రోషన్‌ ప్రధాన పాత్రల్లో హిందీలో రీమేక్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అజిత్‌తో పుష్కర్‌, గాయత్రి ఓ సినిమా చేయాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఐశ్వర్యారాజేష్‌, ఖదీర్‌ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభించినా లాక్‌డౌన్‌తో ఆ ప్రాజెక్ట్‌ నిలిచిపోయింది. 


దర్శకులుగా సోదర ద్వయం 


సస్పెన్స్‌, యాక్షన్‌, రొమాంటిక్‌  థ్రిల్లర్‌ చిత్రాలకు బాలీవుడ్‌లో పెట్టింది పేరు అబ్బాస్‌, మస్తాన్‌ ద్వయం. ఈ సోదరులిద్దరూ కలసి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పలు చిత్రాలను అందించారు. వీటిల్లో  అక్షయ్‌ కుమార్‌ ‘ఖిలాడి’, షారూఖ్‌ ఖాన్‌ ‘బాజీగర్‌’, ‘బాద్‌షా’, సల్మాన్‌ ఖాన్‌ ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి.‘ గడచిన 54 ఏళ్లలో మేమిద్దరం కలవని రోజు లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అబ్బాస్‌, మస్తాన్‌ మధ్య ఇప్పటికి ఎలాంటి అరమరికలు లేవు. ఒకటే సెల్‌ఫోన్‌ను ఇద్దరూ వాడుతున్నారు. ప్రస్తుతం బాబీడియోల్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రల్లో ‘పెంట్‌హౌస్‌’ చిత్రాన్ని అబ్బాస్‌, మస్తాన్‌ తెరకెక్కిస్తున్నారు. 


బాలీవుడ్‌లో కొత్త జోడీ


‘కబీర్‌సింగ్‌’, ‘తానాజీ’ చిత్రాలతో సంగీత దర్శక ద్వయం సాచేత్‌ టాండన్‌, పరంపరా ఠాకూర్‌లు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. 2015లో జరిగిన ‘ద వాయిస్‌ ఇండియా’ రియాలిటీ టాలెంట్‌ షోలో వీరిద్దరూ తుది బరిలో నిలిచారు. అప్పటినుంచే ఇద్దరూ కలసి తమ సంగీత ప్రయాణం కొనసాగిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’లో తొలిసారి కొన్ని పాటలకు సంగీత దర్శకత్వం వహించారు. గతేడాది సాచేత్‌-పరంపరా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘జెర్సీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రానికి కూడా సంగీతం అందించే బాధ్యతను వీరిద్దరికే అప్పగించారు.


సుదీర్ఘ విరామం వచ్చినా 


జోసఫ్‌ డి సమీ, జెరాల్డ్‌ అరోకియామ్‌... ఇద్దరూ తమిళ దర్శకులు. అమితాబ్‌ బచ్చన్‌ నిర్మాతగా అజిత్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో 1997లో వచ్చిన ‘ఉల్లాసం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమయ్యారు. ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో ఇండస్ట్రీలో మళ్లీ  అవకాశాలు రాలేదు. చాన్నాళ్ల తర్వాత  ఈ దర్శకద్వయం  కన్నడ భాషలో ఓ  భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం రూపొందిస్తున్నారు. శరవణన్‌, ఊర్వశి రౌతేలా జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


ఒకే మాట.. ఒకే డ్రస్‌


తెలుగు వారికి పరిచయం అక్కర్లేని ఫైట్‌మాస్టర్లు రామ్‌, లక్ష్మణ్‌. బాల్యం నుంచి ఈ కవల సోదరులు ఇద్దరూ కలసి ఎదిగారు. తెలుగు చిత్రాలతో పాటు దక్షిణాదిన, బాలీవుడ్‌లో పలువురు అగ్రహీరోల చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోరాట దృశ్యాలను వినూత్నంగా రూపొందించడం, కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వైవిధ్యం చూపడంతో ఫైట్‌ మాస్టర్‌లుగా తమ హావా కొనసాగిస్తున్నారు.


అన్బు అరివు


అన్బుమణి, అరివు మణి... చిన్నవయసులోనే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఫైట్‌ మాస్టర్లుగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  రామ్‌ లక్ష్మణ్‌లానే వీరిద్దరూ కూడా కవల సోదరులే కావడం విశేషం. రామ్‌చరణ్‌ ఽ‘దృవ’, రజనీకాంత్‌ ‘కబాలి’, కార్తీ ‘ఖైదీ’, యశ్‌ ‘కేజీఎఫ్‌’ చిత్రాలకు  వీరిద్దరూ రూపొందించిన పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల విడుదలైన సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’కు కూడా  వీరే ఫైట్‌ మాస్టర్లు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ‘అయలాన్‌’, ‘డాక్టర్‌’ తమిళ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు.