రంగు పడుద్ది

ABN , First Publish Date - 2020-06-25T06:53:51+05:30 IST

ఆహార ఉత్పత్తులు కొన్నప్పుడు అవి శాకాహారమో, మాంసాహారమో తెలిపేలా.. ముదురు గోధుమ, ఆకుపచ్చ గుర్తులు ఉంటాయి గమనించారా? వాటిని కలర్‌ కోడ్స్‌ అంటారు...

రంగు పడుద్ది

  • దేశీ, విదేశీ ఉత్పత్తుల మధ్య తేడా
  • తెలిసేలా కలర్‌ కోడ్స్‌ ఇచ్చే యోచన
  • దేశీ ఉత్పత్తులకు కాషాయ రంగు?
  • గవర్న్‌మెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌లో
  • ఉత్పత్తుల మూలాలు తప్పనిసరి
  • భవిష్యత్తులో ఈ కామర్స్‌ సైట్లకూ!
  • ఓడరేవుల్లో చైనా ఉత్పత్తుల నిలిపివేత
  • వాటిలో కొన్ని అమెరికా కంపెనీలవీ..


న్యూఢిల్లీ, జూన్‌ 24: ఆహార ఉత్పత్తులు కొన్నప్పుడు అవి శాకాహారమో, మాంసాహారమో తెలిపేలా.. ముదురు గోధుమ, ఆకుపచ్చ గుర్తులు ఉంటాయి గమనించారా? వాటిని కలర్‌ కోడ్స్‌ అంటారు. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యల నేపథ్యంలో.. దేశీ, విదేశీ ఉత్పత్తుల మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా కలర్‌ కోడ్స్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా దేశీ ఉత్పత్తులకు కాషాయరంగు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే తాము అమ్మే ఉత్పత్తులు ఎక్కడ తయారయ్యాయనే వివరాలు తెలపాల్సిందిగా ఈ కామర్స్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్లాట్‌ఫాంలపై అమ్మే ఉత్పత్తుల మూలాలు, వాటికి స్థానికంగా చేసిన జోడింపుల వివరాలు తెలపాలని పేర్కొంది. ప్రభుత్వానికి చెందిన ఈ-మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం)లో ఈ వివరాలు తెలపడాన్ని జూన్‌ 23 నుంచి తప్పనిసరి చేసింది.


వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు అవసరమైన ఉత్పత్తులను సేకరించే పోర్టల్‌ ఇది. ఈ నిర్ణయానికి సంబంధించి జీఈఎం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘‘ఆత్మనిర్భర భారత్‌’ దిశగా జీఈఎం కీలక అడుగు ముందుకు వేసింది. అందులో కొత్తగా పెట్టే ఉత్పత్తుల మూలాల (ఏ దేశంలో తయారయ్యాయో) వివరాలను విక్రేతలు తప్పనిసరిగా తెలపాలని పేర్కొంది. ఇప్పటికే తమ ఉత్పత్తులను అప్‌లోడ్‌ చేసిన విక్రేతలు కూడా ఆ వివరాలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించింది. చేయని వారి ఉత్పత్తులను జీఈఎం పోర్టల్‌ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కనీసం 50ు స్థానికంగా తయారైన ఉత్పత్తులను గుర్తించి, వాటినే కొనుగోలు చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భవిష్యత్తులో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు కూడా ఈ వివరాలు తెలపాలి. అయితే, ఈ వివరాలను తక్షణం తెలపడం కష్టమని.. ఎందుకంటే కొన్ని కోట్ల ఉత్పత్తులకు సంబంధించి ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయా సంస్థలు అంటున్నాయి. కాగా.. చైనా నుంచి వస్తున్న పలు ఉత్పత్తులను మన ఓడరేవుల్లో అదనపు క్లియరెన్సులు కావాలంటూ అధికారులు నిలిపివేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి అంతరాయాలు, స్పష్టత లేమి వ్యాపారాలకు, ఉత్పత్తి కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తాయని ‘ద యూఎ్‌స-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ (యూఎ్‌సఐఎ్‌సపీఎఫ్‌)’ కేంద్ర వాణిజ్య శాఖకు మంగళవారం ఒక లేఖ రాసింది.

Updated Date - 2020-06-25T06:53:51+05:30 IST