రంగులు మారాల్సిందే..

ABN , First Publish Date - 2020-06-04T10:53:32+05:30 IST

ఏపీలో ప్రభుత్వ భవనాలకు వేసిన అధికార వైఎస్‌ఆర్‌ పార్టీ పతాకాన్ని పోలిన రంగులను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జిల్లాలోని ..

రంగులు మారాల్సిందే..

సుప్రీం ఆదేశాలతో    అధికారుల్లో కలవరం

  పంచాయతీలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలకు వైసీపీ రంగులు 

  జిల్లాలో 3 వేలకు పైగా భవనాలకు వైసీపీ పతాక వర్ణాలు

  ఆ రంగులు మార్చాలంటే మళ్లీ కోట్లు వెచ్చించాల్సిందే..

  రంగుల మార్పిడికి నాలుగు వారాలే సుప్రీం వ్యవధి

  పంచాయతీల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే

  తర్జనభర్జనలు పడుతున్న జిల్లా యంత్రాంగం


 ఏపీలో ప్రభుత్వ భవనాలకు వేసిన అధికార వైఎస్‌ఆర్‌ పార్టీ పతాకాన్ని పోలిన రంగులను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జిల్లాలోని అధికారులు కలవరపాటుకు గురవు తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పంచాయతీ భవనాలు, గ్రామ, వార్డు సచివాలయ భవ నాలతోపాటు ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ పతాక రంగులను వేశారు.ఈ రంగులను మార్చాల్సిందేనని గతంలో మన హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. బుధవారం కేసు విచారణ చేసిన ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లోను నాలుగు వారాల వ్యవధిలో రంగులను మార్చాల్సిందేనని లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించడంతో రంగుల మార్పిడి అనివార్య మైంది.


గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1103 పంచాయతీ లకు వైసీపీ పతాక రంగులతో అందంగా ముస్తాబు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 1271 గ్రామ సచి వాలయాలు, నగర కార్పొరేషన్లు, పట్టణాల్లో ఉన్న వార్డు సచివాలయాలతోపాటు ఇటీవల జిల్లాలో ప్రారంభించిన 1129 రైతు భరోసా కేంద్రాలకు ఇవే రంగులు వేశారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో పంచాయతీకి రూ.50 వేలకు తగ్గకుండా రూ.3 లక్షల వరకు ఆయా పంచాయతీల భవన స్వరూపాలను బట్టి నిధులు వెచ్చించి రంగులు వేశారు. ఇందుకోసం పంచా యతీ, 14వ ఆర్థికసంఘం నిధులను వెచ్చించారు. అదే విధంగా సచివాలయాల భవనాలకు భారీగానే రంగుల కోసం నిధులను వెచ్చించారు. రైతుభరోసా కేంద్రాలతో పాటు గ్రామాల్లోని ఆర్‌డబ్ల్యుఎస్‌ వాటర్‌ ప్రాజెక్టులు, కొన్ని ప్రాంతాల్లో గృహనిర్మాణ పథకాలకు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అర్బన్‌ హౌస్‌లకు సైతం వైసీపీ పతాక రంగులను వేశారు.


జిల్లాలో ఇందుకోసం నిబంధన లకు విరుద్ధంగానే కోట్లాది రూపాయలను వెచ్చించాల్సి వచ్చింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కంగారుపడ్డ అధికారులు కొందరు ఆయా పంచాయతీ, సచివాలయ భవనాలకు వేసిన రంగుల స్థానే మరో రంగును కలిపి స్వల్పంగా చేర్పులు మార్పులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో వేసిన రంగులకే ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పంచాయతీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల వ్యవధిలోనే గతంలో వైసీపీ పతాక రంగులు వేసిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చడం అనివార్యం కావడంతో కాంట్రాక్టర్లు మళ్లీ ఆ భవనాలకు రంగులు మార్పిడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటికీ రంగులు వేయాలంటే కోట్ల రూపాయలు మరోసారి వెచ్చించాల్సిందే. ఆయా భవనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం నిధులు దుర్వినియోగమవుతున్న తీరుపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-06-04T10:53:32+05:30 IST