పంచాయతీలకే సున్నం!

ABN , First Publish Date - 2020-06-04T08:59:56+05:30 IST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందాన తయారయింది పంచాయతీల పరిస్థితి. ప్రభుత్వ అనాలోచిత ..

పంచాయతీలకే సున్నం!

భవనాలకు వైసీపీ జెండా రంగులు మార్చాల్సిందేనని

సుప్రీంకోర్టు ఆదేశం

గతంలో రంగులు వేసేందుకు పైసా విదల్చని ప్రభుత్వం 

14వ ఆర్థిక సంఘం నిధులతో సర్దుబాటు 

మరోమారు ఒక్కో భవనానికి రూ.15 వేల వరకు వ్యయం

తలలు పట్టుకుంటున్న కార్యదర్శులు 

జీవీఎంసీలో సచివాలయాలకు

రంగులు వేసేందుకు రూ.30 లక్షలు వ్యయం


విశాఖపట్నం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందాన తయారయింది పంచాయతీల పరిస్థితి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మరోసారి పెనుభారం పడనుంది. గ్రామ పంచాయతీ భవనాల (ప్రస్తుతం గ్రామ సచివాలయాలు)కు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులు నాలుగు వారాల్లో తొలగించాలని బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ అప్పు చేసి పనులు చేయాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. 


జిల్లాలో 924 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సుమారు 600 పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నాయి. ఈ భవనాలకు గత ఏడాది వైసీపీ జెండాను పోలిన మూడు రంగులను వేశారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. రంగులు వేయాలని నిర్దేశించిన ప్రభుత్వం నిధులు మాత్రం మంజూరు చేయలేదు. గ్రామ పంచాయతీలే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని ఆదేశించింది. అప్పటికే నిధులు లేక తీవ్ర ఇబ్బందుల్లో వున్న పంచాయతీ అధికారులు అప్పులు చేసి మరీ రంగులు వేయించాశారు.


అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి బిల్లులు పంపారు. అయితే తమవద్ద నిధులు లేవని, స్థానికంగా వచ్చే నిధుల నుంచే రంగుల ఖర్చుకు కేటాయించాలని ఆయన సెలవిచ్చారు. ఈలోగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో చేసిన అప్పులు తీర్చగలిగారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో గతంలో వేసిన రంగులు నాలుగు వారాల్లో తొలగించాలి. ఇందుకోసం కనీసం సున్నమైనా కొనుగోలు చేయాలి. దీంతో ఒక్కో భవనానికి రూ.10 వేల నుంచి 15 వేలు ఖర్చు అవుతుందని పంచాయతీ ఉద్యోగి ఒకరు తెలిపారు. గతంలో చేసిన అప్పులను తీర్చి, బిల్లులను ఇప్పుడిప్పుడే అప్‌లోడ్‌ చేశామని, మళ్లీ సున్నం వేయడం కోసం నిధుల వేట తప్పదని వాపోయారు. 


జీవీఎంసీపై రూ.20 లక్షల భారం 

జీవీఎంసీ పరిధిలోని సచివాలయ భవనాలకు వేసిన వైసీపీ జెండా రంగులను తొలగించేందుకు కనీసం రూ.20 లక్షలు అవసరమని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 520 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 387 ప్రభుత్వ భవనాలు. కాగా సచివాలయ భవనం ముందుభాగంలో కచ్చితంగా పార్టీ పతాకం రంగులు వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అప్పట్లో సుమారు రూ.30 లక్షలు వెచ్చించి రంగులు వేశారు. అద్దె భవనాలకు భవన యజమానులే రంగులు వేసి అప్పగించారు. తాజాగా సుప్రీంతీర్పుతో ఈ రంగులు మార్చేందుకు సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించాల్సి ఉందంటున్నారు. 

Updated Date - 2020-06-04T08:59:56+05:30 IST