ఈ-కొలి బ్యాక్టీరియాతో పెద్దపేగు కేన్సర్‌

ABN , First Publish Date - 2021-03-08T09:05:46+05:30 IST

హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పెద్దపేగు (కొలొరెక్టల్‌) కేన్సర్‌ కేసులు రెట్టింపైన ప్రస్తుత తరుణంలో.

ఈ-కొలి బ్యాక్టీరియాతో పెద్దపేగు కేన్సర్‌

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 7: హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పెద్దపేగు (కొలొరెక్టల్‌) కేన్సర్‌  కేసులు రెట్టింపైన ప్రస్తుత తరుణంలో.. ఈ పరిణామానికి దారితీసిన ముఖ్య కారణాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనుషుల చిన్న పేగుల్లో ఉండే ఈ-కొలి బ్యాక్టీరియా వల్లే మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్దపేగు కేన్సర్లు నమోదవుతున్నట్లు గుర్తించారు. ఈ-కొలి బ్యాక్టీరియాల 4వేలకు పైగా జన్యువుల విశ్లేషణలో ఈవిషయం తేలినట్లు వెల్లడించారు. ఆ బ్యాక్టీరియా విడుదల చేసే ‘కొలిబ్యాక్టిన్‌’ అనే రసాయనానికి మానవ శరీర కణాల డీఎన్‌ఏకు నష్టం కలిగించగల శక్తి ఉంటుందన్నారు. కొలిబ్యాక్టిన్‌ వల్లే పలువురికి పెద్దపేగు కేన్సర్‌ వస్తోందని తెలిపారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,  కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను అతిగా తినడం, సమయం కాని సమయంలో ఆహారం తీసుకోవడం కూడా దీనికి దారితీయొచ్చని హెచ్చరించారు. ఈ రకం కేన్సర్‌ ప్రధానంగా పెద్దపేగు, మల ద్వారాలలో వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 శాతం ఈ-కొలి బ్యాక్టీరియాలు కొలిబ్యాక్టిన్‌ రసాయనాన్ని విడుదల చేస్తుంటాయని, భారత్‌లో అది కేవలం 7 శాతమేనని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఈ-కొలి బ్యాక్టీరియాను అదుపులో ఉంచొచ్చని సూచించారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన బయోటెక్నాలజీ అండ్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగం శాస్త్రవేత్త నియాజ్‌ అహ్మద్‌తో కూడిన పరిశోధక బృందం ఈమేరకు వివరాలతో అధ్యయన నివేదికను రూపొందించింది. అది మార్చి 2న అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రోబయాలజీకి చెందిన ‘ఎంబయో’ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Updated Date - 2021-03-08T09:05:46+05:30 IST