కోలన్‌ కేన్సర్‌

ABN , First Publish Date - 2021-02-09T07:41:34+05:30 IST

పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్‌ ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే కోలన్‌ కేన్సర్‌. కోలనోస్కోపీలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే తీయించుకోవడం ఉత్తమం. జీన్‌ మ్యుటేషన్‌,

కోలన్‌ కేన్సర్‌

(పెద్దపేగు చివరి భాగపు కేన్సర్‌)


పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్‌ ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే కోలన్‌ కేన్సర్‌. కోలనోస్కోపీలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే తీయించుకోవడం ఉత్తమం. జీన్‌ మ్యుటేషన్‌, ఊబకాయం, రెడ్‌ మీట్‌ తినే అలవాటు, పీచు తక్కువగా తినేవారు, మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నవారితో పాటు, కేన్సర్‌ రేడియేషన్‌, క్రాన్స్‌ డిసీజ్‌ కూడా కోలన్‌ కేన్సర్‌ రావడానికి కారణాలు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ వయస్కుల్లో మరింత ఎక్కువ. 


లక్షణాలు

అజీర్తి, విరేచనాలు, మలం, మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తం, రక్తం చారికలు, పొట్ట దిగువభాగంలో నొప్పి, పట్టేసినట్టు ఉండడం, గ్యాస్‌ ఉండడం, మలవిసర్జన సమయంలో నొప్పి, అకారణంగా నీరసం, బరువు తగ్గడం, ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ప్రధాన లక్షణాలు. ఈ కేన్సర్‌ను అశ్రద్ధ చేస్తే చివరకు కాలేయానికి కూడా పాకే ప్రమాదం ఎక్కువ. అజీర్తి, విరేచనాలు పదే పదే ఇబ్బంది పెడుతున్నా, సమస్య తగ్గకుండా ఎక్కువ అవుతున్నా ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి.

పరీక్షలు

కొలనోస్కోపీ, బేరియం ఎనీమా ఎక్స్‌ రేలతో కోలన్‌ కేన్సర్‌ను కనిపెట్టవచ్చు. పాలిప్స్‌, కణుతులను తొలగించి, బయాప్సీ ద్వారా కేన్సర్‌ సోకిందీ, లేనిదీ కనిపెడతారు. కేన్సర్‌ అని నిర్థారణ జరిగితే కణితి పరిమాణం, లింఫ్‌నోడ్స్‌కు ఎంతవరకూ పాకింది తెలుసుకోవడం కోసం ఇతర పరీక్షలు చేస్తారు. చెస్ట్‌ ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, సి.టి స్కాన్‌, సి.ఇ.ఎ పరీక్షలు అవసరం అవుతాయి. పెట్‌ స్కాన్‌తో కేన్సర్‌ దశను నిర్థారిస్తారు. 


నివారణ

50 ఏళ్లు పైబడిన వారు మల పరీక్ష (ఎఫ్‌.ఒ.బి.టి), డాక్టర్‌ సలహా మేరకు సాగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకుంటే కోలన్‌ కేన్సర్‌ను ముందుగానే కనిపెట్టవచ్చు. అలాగే మంచి ఆహారపుటలవాట్లు, జీవనశైలి కూడా ముఖ్యమే! పైల్స్‌ ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం పడవచ్చు. అయినా పరీక్షలతో కేన్సర్‌ కాదని నిర్ధారించుకోవడం అవసరం. కోలన్‌ కేన్సర్‌ లక్షణాలు అజీర్తి లక్షణాలను పోలి ఉంటాయి. కాబట్టి సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయుంచుకోవాలి.

చికిత్స

తొలి దశలోనే గుర్తిస్తే రాడికల్‌ సర్జరీ చేయించుకోవచ్చు. లాప్రోస్కోపిక్‌ పద్ధతిలో వ్యాధి సోకిన ప్రాంతాన్ని పెద్దదిగా చేసి, స్పష్టంగా పరీక్షించే వీలుంటుంది. ఓపెన్‌ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపిక్‌ సర్జరీలో కచ్చితత్వం ఎక్కువ. సర్జరీ తర్వాత రోగి కోలుకునే సమయం కూడా తక్కువే! రోగి ఆరోగ్యం, కేన్సర్‌ దశ, రకాన్ని బట్టి రేడియోథెరపీ, కీమోథెరపీలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ఎడమవైపు కోలన్‌ కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తిస్తే ముందు కీమోథెరపీ, రేడియేషన్‌ ఆ తర్వాత సర్జరీ చేస్తారు. కేన్సర్‌ను చివరి దశలో గుర్తించినా మోనోక్లోరల్‌ వంటి మాత్రలతో రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.


డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ,

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Read more