Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 21 Jan 2022 02:28:18 IST

సర్కారుతో ఉమ్మడిగా ఢీ

twitter-iconwatsapp-iconfb-icon
సర్కారుతో ఉమ్మడిగా ఢీ

ఇక ఉమ్మడి పోరు

సమ్మె కైనా.. ఎస్మా కైనా.. సై

ఫ్యాప్టో కలెక్టరేట్ల ముట్టడితో వేడి

వేలాదిగా కదిలివచ్చిన ఉపాధ్యాయులు

అడ్డుకోలేని అరెస్టులు, నిర్బంధాలు..

ఇక అన్ని సంఘాల ఐక్య పోరాటం

చేతులు కలిపిన ఉద్యోగ సంఘాల నేతలు..

నేడు సమావేశమై ఉద్యమ కార్యాచరణ

సమ్మెకు నోటీసు ఇవ్వడంపైనా నిర్ణయం..

ఉద్యోగులపై మంత్రుల మాటల దాడి

బండి, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి కలయిక


తగ్గేదేలే..

ఉద్యమ వేడి చూపిస్తాం

ఆ జీవోలు మాకు గొడ్డలిపెట్టు

కలిసికట్టుగా పోరాటం: బండి


వెనక్కి తగ్గేదే లేదు

పీఆర్సీ జీవోలన్నీ వ్యతిరేకిస్తున్నాం

నేడు ఉమ్మడి కార్యాచరణ: బొప్పరాజు


గొడవ పెద్దది చేయొద్దు

ఇకనైనా న్యాయం చేయండి

సీఎస్‌వి అవాస్తవాలు: వెంకట్రామిరెడ్డి 


ఉబుకుతున్న ఆగ్రహం

ఇక ఉమ్మడిగా పోరాడతాం

మా లక్ష్యం ఒక్కటే: సూర్యనారాయణ


పీఆర్సీ జీవోలతో తీవ్ర నిరాశ

జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ 


తగ్గాల్సిందే..

చర్యకు ప్రతి చర్య!

ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు

ఘర్షణా? పరిష్కారమా?: బొత్స


ఐఆర్‌ జీతంలో భాగమా?

జీతం పెరిగిందో లేదో చూడండి

నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు: పేర్ని


నాడు ఒప్పుకొన్నారుగా!

ఇప్పుడు ఆందోళనలు ఏమిటి?

సమస్యలుంటే చర్చలు: సురేశ్‌


జీతాలు పెరుగుతాయి

27శాతం ఐఆర్‌ ఎవరైనా ఇచ్చారా?

విపక్షాల ఉచ్చులో పడొద్దు: చీఫ్‌విప్‌


నేడు మంత్రివర్గ సమావేశం

పీఆర్సీపై చర్చించే అవకాశం!


ఉపాధ్యాయులు పిడికిలి బిగించారు. ఉద్యోగులు స్వరం పెంచారు. ‘రివర్స్‌ పీఆర్సీ’పై రణభేరి మోగించారు. ‘ఫ్యాప్టో’ గురువారం నిర్వహించిన ‘కలెక్టరేట్ల ముట్టడి’తో సర్కారుకు సెగ తగిలింది. ముందస్తు అరెస్టులను, నిర్బంధాలను ఛేదించుకుని వేలాదిమంది ఉపాధ్యాయులు కలెక్టరేట్ల గేట్లను తాకారు. పలు జిల్లాల్లో బారికేడ్లను, గేట్లను దాటుకుని కలెక్టర్‌ కార్యాలయాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ‘‘ఈ పీఆర్సీ మాకొద్దు, హెచ్‌ఆర్‌ఏ తగ్గించొద్దు, సీపీఎస్‌ రద్దు చేయాలి’ అంటూ అనేక డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. సర్కారు తీరుపై మండిపడ్డారు. ఫ్యాప్టో నిరసనలకు ఇతర ఉద్యోగ నేతలు సంఘీభావం ప్రకటించారు. న్యాయమైన పీఆర్సీ సాధనకు ఉమ్మడిగా పోరాడాలని తీర్మానించారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం... ఇలా వేదికలు ఏవైనా, పీఆర్సీ సాధన కోసం చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘాల నేతలు గురువారం విజయవాడలో సమావేశమై దీనిపై చర్చించారు. శుక్రవారం మరోమారు చర్చించి... ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని, ఇందులో భాగంగా సమ్మె నోటీసు ఇవ్వడంపైనా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించుకున్నారు. ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు మీడియా ముందుకు వచ్చి, అసత్యాలు చెప్పి... ఉద్యోగులను మరింత రెచ్చగొట్టారంటూ మండిపడ్డారు. ఇక వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.


అమరావతి, విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ‘వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటి వరకు రెండు జేఏసీలే. ఇక మీదట నాలుగు జేఏసీల ఐక్య వేదిక ఉంటుంది. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ తీసుకుని ఒకే వేదిక, ఒకే డిమాండ్లు, ఒకే వాదనలతో కలిసి పయనిస్తాం. ఉద్యోగులంతా కోరుకున్నట్టు నాలుగు సంఘాల అగ్రనాయకత్వాలు మనసు విప్పి మాట్లాడుకున్నాం. పీఆర్‌సీ జీవోలపై సమీక్షించుకున్నాం. నాలుగు జేఏసీల ఐక్య సంఘటన ద్వారా మా ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తాం. సమ్మె కాదు.. ఎస్మా అయినా సరే ఎదురొడ్డి నిలబడతాం’ అని ఉద్యోగ జేఏసీల రాష్ట్ర అగ్రనాయకత్వం ప్రకటించింది. గురువారం విజయవాడలో ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జేఏసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం సచివాలయంలో అన్ని సంఘాలు కలిసి విధివిధానాలు రూపొందించుకున్న తర్వాత ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు. సమావేశం తర్వాత నలుగురు నేతలూ ఇదే  విషయం చెప్పారు. అంతకుముందు కేఆర్‌ సూర్యనారాయణ అమరావతి సచివాలయానికి వెళ్లి వెంకట్రామిరెడ్డితో భేటీ అయ్యారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఉమ్మడి పోరు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. బయటికి వచ్చాక వారు మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీపై సీఎంవో ఉన్నతాధికారులతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఓ ఫైల్‌ పెండింగ్‌  విషయమై మాట్లాడేందుకే వచ్చామని చెప్పారు.    


4 జేఏసీలు కలిశాయి: బండి..

ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, డైలీ వేజ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా నాలుగు జేఏసీల అగ్రనాయకత్వాలు కలిశాయన్నారు. మెరుగైన పీఆర్‌సీ సాధన కోసం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేయాలన్న అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. ఉమ్మడి ఉద్యమానికి విధి విధానాల కోసం శుక్రవారం సచివాలయంలో మరోమారు నాలుగు జేఏసీల ముఖ్య నాయకత్వాలన్నీ కూర్చుని కీలక నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. అలాగే, ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి వేర్వేరుగా ఎగ్జిక్యూటివ్‌ కౌనిల్స్‌ నిర్వహించాయని, ఇరు జేఏసీలు కలిసి మళ్లీ సమావేశాలు నిర్వహించుకుంటాయని తెలిపారు.   


ఇక ఉమ్మడి కార్యాచరణ: సూర్యనారాయణ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ  విడివిడిగా ఆందోళనలు  కాకుండా.. వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చామన్నారు. 4 ఉద్యోగ సంఘాల జేఏసీలు కలిసి చర్చించుకోవటం చరిత్రలో లిఖించదగ్గ శుభపరిణామంగా పేర్కొన్నారు. 


అన్నీ చర్చించాం: వెంకట్రామిరెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఉమ్మడి కార్యాచరణ అవసరమని భావించామన్నారు. అన్ని విషయాలను చర్చించుకున్నామని, శుక్రవారం సమగ్రంగా చర్చించిన మీదట ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.


ఒకే వేదికపైకి 4 జేఏసీలు: బొప్పరాజు

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగుల శ్రేయస్సు కోసం నాలుగు జేఏసీల నాయకులమంతా ఒకే వేదిక మీదకు వచ్చి విశాల దృక్పథంతో అన్ని అంశాలూ చర్చించుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టాలి? పీఆర్‌సీ సాధన కోసం ఏమి చేయాలి? అన్న అంశాలపై చర్చించుకుని విధానాలను ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. 


గుణ‘పాఠం’

మేం ఉపాధ్యాయులం. చదువు నేర్పించే వాళ్లం. మొండివాళ్లను ఎలా దారికి తేవాలో మాకు తెలుసు. మాతో పెట్టుకోకండి. మాకు లెక్కలు చెప్పడం వచ్చు. కానీ... మీ దగ్గర దొంగ లెక్కలు వేసేవాళ్లు బాగా ఎక్కువగా ఉన్నారని అర్థమవుతోంది. ఐదేళ్లుండే మీకేమో వేల కోట్లు కావాలి. జీవితాంతం సర్వీస్‌ చేసే మాకు మాత్రం ఇవ్వాల్సింది ఇవ్వరా? మా ప్రయోజనాలు దక్కాలి. అంతే!

- ఆందోళనలో పాల్గొన్న ఒక మహిళా ఉపాధ్యాయురాలుAdvertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.