Abn logo
Sep 21 2021 @ 15:38PM

8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసిన కొలిజియం

న్యూడిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలిజియం సెప్టెంబర్ 16న సమావేశమై 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సిఫారసు చేసింది. మరో 5 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,17 హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో మంగళవారం అప్‌లోడ్ చేసింది. కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రాజేష్ బిందాల్‌ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది.


ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రితురాజ్ అవస్తిని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అరవింద్‌కుమార్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, హిమాచల్‌ప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆర్‌వి.మలిమత్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌కు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ మహమ్మద్ రఫీక్‌ను  హిమాచల్‌ప్రదేశ్‌కు, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అకిల్ ఖురేషీని రాజస్థాన్‌కు, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపురకు, మేఘలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ బిశ్వనాథ్‌ను సిక్కింకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.