అల‌బామాలో విద్యార్థుల 'కోవిడ్ పార్టీలు'.. మ‌హ‌మ్మారితో ఆట‌లు.. పైగా బెట్టింగ్స్‌

ABN , First Publish Date - 2020-07-03T16:03:13+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అంత‌కంత‌కు కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

అల‌బామాలో విద్యార్థుల 'కోవిడ్ పార్టీలు'.. మ‌హ‌మ్మారితో ఆట‌లు.. పైగా బెట్టింగ్స్‌

అల‌బామా: అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అంత‌కంత‌కు కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే యూఎస్‌లో 1.30ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకున్న ఈ వైర‌స్... 28 ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది. క‌రోనా ఎప్పుడు ఎక్కడ ఎవ‌రిని ఎలా అంటుకుంటుందో తెలియదని ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి కూడా. దీంతో ఎక్క‌డ ఈ వైర‌స్ త‌మ‌కు సోకుతుందోన‌ని చాలా మంది ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే... అగ్ర‌రాజ్యంలో కొంద‌రు కాలేజీ కుర్రాళ్లు ఈ మ‌హ‌మ్మారితో చెల‌గాటం ఆడుతున్నారు. కావాల‌ని పార్టీల పేరుతో క‌రోనా రోగుల‌ను పిలిచి ఆట‌లు ఆడుతూ బెట్టింగ్స్ నిర్వ‌హిస్తున్న‌ ఘ‌ట‌నలు తాజాగా అల‌బామా రాష్ట్రం టుస్కాలోసా న‌గ‌రంలో వెలుగుచూశాయి.


టుస్కాలోసా సిటీ కౌన్సిలర్ సోన్యా మెకిన్స్ట్రీ ‌తెలిపిన వివ‌రాల ప్రకారం... "అల‌బామా రాష్ట్రంలోని ప‌లు కాలేజీల‌కు చెందిన విద్యార్థులు ఇటీవ‌ల తర‌చూ కోవిడ్‌-19 పార్టీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ పార్టీల‌కు విద్యార్థులు కావాల‌నే క‌రోనా రోగుల‌ను ఆహ్వానిస్తున్నారు. అనంత‌రం ఒక కుండ‌లో భారీ మొత్తంలో న‌గ‌దు పెట్టి.. మొద‌ట దాన్ని కోవిడ్ పేషెంట్‌తో ట‌చ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత పార్టీకి హాజరైనవారిలో ఎవరికైతే వైద్య పరీక్షల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అవుతుందో, ఆ కుండలోని న‌గ‌దును వారికి ప్రైజ్ మనీగా అందజేస్తున్నారని" ఆమె చెప్పారు.


ఇలా మ‌హ‌మ్మారితో విద్యార్థులు ప‌రాచ‌కాలు ఆడుతున్న ఇలాంటి భ‌యంక‌ర‌ పార్టీలు టుస్కాలోసా న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రుగుతున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని సోన్యా తెలిపారు. ఒక ప్రాణాంతక వైరస్‌తో చదువుకున్న విద్యార్థులు ఇలా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించడం చూస్తుంటే భ‌య‌మేస్తోంద‌న్నారు. ఇలాంటి మ‌తిలేని ప‌నుల వ‌ల్ల వారి ఇంట్లో వాళ్ల‌కు కూడా వైర‌స్ సులువుగా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక అలాబామా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 39వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1000 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు.

Updated Date - 2020-07-03T16:03:13+05:30 IST