త్వరలో కాలేజీ విద్యార్థినులకు రూ.1000 ఉపకారవేతనం

ABN , First Publish Date - 2022-06-16T12:54:40+05:30 IST

పదో తరగతి వరకూ ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివి కళాశాలల్లో చేరే విద్యార్థినులకు త్వరలో ప్రతినెలా రూ.1000 ఉపకార వేతనం చెల్లించనున్నామని

త్వరలో కాలేజీ విద్యార్థినులకు రూ.1000 ఉపకారవేతనం

                                       - మంత్రి గీతాజీవన్‌


చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వరకూ ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివి కళాశాలల్లో చేరే విద్యార్థినులకు త్వరలో ప్రతినెలా రూ.1000 ఉపకార వేతనం చెల్లించనున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్‌ ప్రకటించారు. అశోక్‌నగర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన వృద్ధులపై వేధింపుల నిరోధక దినం కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే కళాశాలల్లో చేరే విద్యార్థినులకు ప్రతి నెలా వారి బ్యాంక్‌ ఖాతాలో రూ.1000 జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇదే విధంగా ప్రభుత్వ, కార్పొరేషన్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభించనున్నారని వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫామ్‌ తయారీ పనులు చురుకుగా సాగుతున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 

 

త్వరలో గృహిణులకు రూ.1000

- ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌

 డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు గృహిణులకు ప్రతినెలా రూ.1000 వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేసే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు. మదురై కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాలలో బుధవారం ఉదయం అదనపు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఉచితబియ్యం పొందుతున్న, అల్పాదాయ వర్గాల రేషన్‌కార్డుదారులైన గృహిణులకు ప్రతినెలా వెయ్యి రూపాయలను వారి ఖాతాలో జమ చేయడానికి ప్రస్తుతం శాఖాపరమైన పరిశీలన జరుగుతోందన్నారు. ఇదివరకే నగల తాకట్టు రుణాల మాఫీ, పంట రుణాల మాఫీ, కరోనా సందర్భంగా రూ.4వేల ఆర్థిక సాయం పంపిణీ వంటి పథకాల్లో కొన్ని తప్పిదాలు జరిగాయని, ఈ నేపథ్యంలో గృహిణులకు వెయ్యిరూపాయాలు చెల్లించే పథకంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అమలు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారన్నారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా లబ్ధ్దిపొందనున్నవారి వివరాల సేకరణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-16T12:54:40+05:30 IST