కోర్టు బోనులో కళాశాల భూములు

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల భూముల వివాదం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు.

కోర్టు బోనులో కళాశాల భూములు
కోర్టు వివాదంలో ఉన్న కళాశాల ఆట స్థలం

- భూముల పరిశీలనకు కమిటీని నియమించిన కామారెడ్డి కోర్టు

- శనివారం వివాదాస్పద భూమిని పరిశీలించిన కమిటీ

- భూములు తమవేనంటూ కోర్టులో కేసు వేసిన పలువురు

- వివాదంలో 8.25 ఎకరాల భూమి

కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, నవంబరు 27: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల భూముల వివాదం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు ఎన్ని పోరాటాలు చేసినా ఎక్కడో ఓ చోట నుంచి వివాదాలు మళ్లీ మొదలవుతునే ఉన్నాయి. గతంలో కళాశాలలోని పలు ప్రాంతాల్లో కబ్జాదారులు పాగా వేయడం, కళాశాల స్థలంలోని మున్సిపల్‌ పార్కులను ఏర్పాటు చేయడం, సంవత్సరాల నుంచి భూమి విషయంలో కన్నెత్తి చూడని వారు రియల్‌ వ్యాపారం పుంజుకోవడం, భూముల విలువ పెరగడంతో కళాశాల భూమిలోని పలు సర్వే నెంబర్‌లలో ఉన్న స్థలాలు తమవంటూ తెరమీదకు వస్తున్నారు. ఈ తరహా దందాకు చెక్‌ పెట్టేందుకు కళాశాల సిబ్బంది, సొసైటీ సభ్యులు ప్రభుత్వం దృష్టికి ఈ వ్యవహారం తీసుకువెళ్లి ప్రభుత్వం పరం చేస్తూ రిజిస్ట్రేషన్‌ సైతం చేపట్టారు. అయితే ప్రస్తుతం మరో 8.25 ఎకరాల భూమి విషయంలో కొందరు కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు నియమించిన కమిటీ శనివారం వివాదంలో ఉన్న భూమిని పరీక్షించేందుకు వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న భూమిని పరిశీలించి, అక్కడ ఉన్న కళాశాల సిబ్బంది అభిప్రాయాలు, పలువురు నాయకులు, స్థానికుల అభిప్రాయాలు తీసుకుని కోర్టుకు అందించేందుకు సిద్ధమైంది.

భవిష్యత్తు తరాల కోసం రైతులు అందించిన భూమి

కామారెడ్డి ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో 1964 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ బీఎన్‌ రామన్‌ ఆధ్వర్యంలో పలువురు పెద్దమనుషులు కలిసి కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని ఏర్పాటు చేసి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలను స్థాపించారు. అప్పుడు రైతుల నుంచి 262 ఎకరాల భూమిని సేకరించి అందులో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రెండోంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టి కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. అయితే సొసైటీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ దశాబ్దాల పాటు ఉద్యమాలు జరిగాయి. చివరకు ప్రభుత్వం కాలేజీని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆస్తుల వివాదం అలాగే ఉండిపోయింది. ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌తో విద్యాభిమానులు మళ్లీ పోరాటం చేశారు. కాలేజీ ఆస్తులపై విద్యార్థులు, ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు ఫలించాయి. 2017లో కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ ఆ భూములను ప్రభుత్వానికి అందించింది.

వివాదంలో మరో 8.25 ఎకరాల భూమి

కళాశాలకు చెందిన 8.25 ఎకరాల భూమి ఇప్పటికీ వివాదంలో ఉంది. ఈ భూమి తమేదనంటూ ప్రస్తుత కళాశాల ఆట స్థలంలో కొందరూ గతంలో దున్నేందుకు ప్రయత్నించగా విద్యార్థి సంఘాల నాయకులు, ఎమ్మెల్యే ఆ భూమిని చదును చేయించారు. దీంతో ఈ వివాదం మళ్లీ కోర్టు మెట్లెక్కడంతో శనివారం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు వివాదాస్పద భూమిని పరిశీలించారు. కళాశాల భూములకు సంబంధించి 262 ఎకరాలలో అప్పటి కాలేజీ ఎడ్యుకేషన్‌ పలు విద్యా సంస్థలకు, హాస్టళ్లకు, పోలీసుస్టేషన్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, స్టేడియం, గోదాములతో పాటు తదితర వాటికి భూములను కేటాయించగా ప్రస్తుతం 158.9 ఎకరాల ఖాళీ భూములు ఉండగా వీటిని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం ఈ భూములలోంచే పలు చోట్ల కబ్జాలకు పాల్పడుతున్నారని విద్యారి ్థసంఘాలు, కళాశాల పరిరక్షణ కమిటీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST