- విద్యార్థిని ఆత్మహత్య
చెన్నై: నాగపట్టినం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాల నిర్వాహకులు ఫీజు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల్లో నిలబెట్టడం, వారిని బలవంతంగా సెలవుపెట్టి వెళ్ళాలని చేస్తున్న వేధింపులను తట్టుకోలేక ఆ పాఠశాలలో చదువుతున్న ఓ కార్మికుడి కుమార్తె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగపట్టినం జిల్లా నాగూరు సమీపం అమృతానగర్లో సుబ్రమణి, చిత్ర దంపతుల మూడో కుమార్తె సుభాషిణి పాప్పార్కోవిల్లోని సర్ ఐజాక్ న్యూటన్ కళాశాలలో ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సెమిస్టర్ ముగియనుండటంతో సుభాషిణిని కళాశాల యాజమాన్యం పిలిచి రూ.55 వేల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఆ కళాశాలలో ఫీజు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల్లో రోజుంతా నిలబెట్టడం, నిర్బంధంగా సెలవుపెట్టి వెళ్ళిపొమ్మని బెదిరించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఫీజు చెల్లించని విద్యార్థులు కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సుభాషిణి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఆమె గదిలో ఉరిపోసుకుని వేలాడుతుండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. నాగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా విద్యార్థిని కుటుంబీకులు, స్థానికులు ప్రైవేటు కాలేజీ నిర్వాహకుల తీరును ఖండిస్తూ రాస్తారోకో జరిపారు. ఈ సమాచారం తెలుసుకుని డీఎస్పీ శరవణన్ ఇతర పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళన జరుపుతున్నవారితో చర్చించారు. ఆ కళాశాలలో ఫీజులు చెల్లించమని వేధించడం వల్ల గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వివరాలన్నీ తెలుసుకున్న డీఎస్పీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాల కరస్పాండెంట్ ఆనంద్, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతన్, ఫిజియోథెరఫీ అధ్యాపకులు జెన్సీపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి