Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతీగతి లేని కలెక్టరేట్‌... మూడేళ్లయినా తీరని ముచ్చట

2018లో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు ప్రారంభం

ఈ దసరాకూ పూర్తి కాని వైనం

2022 మార్చి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం


మెదక్‌ మున్సిపాలిటి, అక్టోబరు 14: దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునఃర్విభజనలో మెదక్‌ జిల్లా కొత్తగా ఏర్పాటైంది. జిల్లా ఏర్పాటుతో పాటు నూతన కలెక్టరేట్‌ భవన సముదాయానికి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. జిల్లా కేంద్రం ఏర్పడ్డ నాటి నుంచి స్థానికంగా భూ విలువలు పెరిగాయి కానీ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మాత్రం మూడేళ్లయినా పూర్తికాలేదు. సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి రూ.42 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మే నెలలో భూమి పూజ చేశారు. ఆ తర్వాత ప్రతి యేటా ఈ దసరాకు ప్రారంభిస్తాం.. అని అధికారులు చెబుతున్నారే తప్ప పనులు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాలు లేవు.  

 జిల్లాగా ఏర్పాటైన తర్వాత స్థల ఎంపికలో కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత హౌసింగ్‌బోర్డు శివారులోని ప్రభుత్వ స్థలంలో కలెక్టరేట్‌ నిర్మాణానికి  భూమి పూజ చేశారు. 2018లో పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్‌ అంచనాలు పెరిగాయని రూ.42కోట్ల పనులను రూ.50కోట్లుగా గుర్తించారు. తదనంతరం పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలంటే మరో రూ.13కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదించారు. అయితే మొదట అదనంగా అడిగిన రూ.8కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌ భవనంతో పాటు కలెక్టర్‌, జేసీ క్యాంప్‌ కార్యాలయాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండోదఫా ప్రతిపాదిత రూ.13కోట్లు మంజూరు చేస్తే తప్ప పనులు చేపట్టలేమని అధికారులు చెబుతున్నారు. 


నిధుల కొరత వల్లే..

2018లో కలెక్టరేట్‌ ప్రారంభించినప్పటికీ కరోనా కారణంగా ఏడాది పాటు నిర్మాణాలు నిలిచిపోయాయని ఆర్‌అండ్‌బీ ఏఈ రియాజ్‌ తెలిపారు. రెండో దఫా ప్రతిపాదిత నిధులు మంజూరయితే కలెక్టరేట్‌ ఆవరణలో అంతర్గత రోడ్లు, భవనంలో ఫ్లోరింగ్‌, గార్డెనింగ్‌, అప్రోచ్‌ రోడ్డుతో పాటు ప్రహరీ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారెడ్డి సైతం దసరా, దీపావళి నాటికి కలెక్టరేట్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కానీ అవసరం మేర నిధులు మంజూరు కాకపోవడంతో మరింత ఆలస్యమవుతున్నది. పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేసి 2022 మార్చి వరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఏఈ రియాజ్‌ పేర్కొన్నారు. 


నిర్మాణ దశలో ఉన్న భవనం


అభివృద్ధికి నోచుకోని కలెక్టరేట్‌ ముందు భాగం


Advertisement
Advertisement