కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం!

ABN , First Publish Date - 2022-01-21T05:22:21+05:30 IST

విజయనగరంలో గురువారం ఉపాధ్యాయులు, ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (ఫ్యాప్టో), అనుబంధ సంస్థలు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా ఉపాధ్యాయులను, సంఘ ప్రతినిధులను అరెస్ట్‌ చేశారు. అయినా వేలాది మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం!
కలెక్టరేట్‌ ముట్టడికి హాజరైన వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు

కదంతొక్కిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు

ఉదయం 9 గంటలకే చేరుకున్న వేలాది మంది నిరసనకారులు

నిరసన ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు..

లోపలకు చొచ్చుకెళ్లేందుకు యత్నం

నిలువరించేందుకు పోలీసుల ఆపసోపాలు

అక్కడే బైఠాయించిన ఆందోళనకారులు

మధ్యాహ్నం 1 గంట వరకే సాగిన నిరసన కార్యక్రమాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 20:  విజయనగరంలో గురువారం ఉపాధ్యాయులు, ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (ఫ్యాప్టో), అనుబంధ సంస్థలు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా ఉపాధ్యాయులను, సంఘ ప్రతినిధులను అరెస్ట్‌ చేశారు. అయినా వేలాది మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ తదితర ఉద్యోగులు ముట్టడికి సంఘీభావం తెలిపారు. దాదాపు 2 వేల మంది నిరసన ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్‌ వలయాన్ని దాటుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను ఎత్తివేసి పక్కకు పడేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నిరసనకారులు కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాటలతో హోరెత్తించారు. మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం కదంతొక్కారు. నిరసన కార్యక్రమాలతో ప్రధాన రహదారిపై  ట్రాఫిక్‌ గంట పాటు నిలిచిపోయింది. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీంతో వాహనాలు ముందుకు సాగాయి. నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఆర్‌ కంటే పీఆర్సీ తగ్గించడం సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంతో ఉద్యోగులకు వేలాది రూపాయల నష్టం వాటిల్లుతుందన్నారు. అనంతరం ఆందోళనకారులు ర్యాలీగా జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.  ఉదయం 9.30కు ప్రారంభమైన నిరసన మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా ఓస్డీతో పాటు అడిషనల్‌ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పదుల సంఖ్యలో ఎస్‌ఐలు, వందలాది మంది పోలీసులు మోహరించారు. నిరసన కార్యక్రమాలను చిత్రీకరించేందుకు ఇద్దరు ప్రైవేటు వీడియోగ్రాఫర్లను ఏర్పాటుచేయడం విశేషం



Updated Date - 2022-01-21T05:22:21+05:30 IST