కలెక్టరైట్‌ రైట్‌

ABN , First Publish Date - 2021-12-16T05:34:19+05:30 IST

ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ప్రభుత్వం 2017 అక్టోబరులో సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.

కలెక్టరైట్‌ రైట్‌
భువనగిరిలో ప్రారంభానికి సిద్ధమైన కలెక్టరేట్‌ భవనం

ప్రారంభానికి సిద్ధంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌

త్వరలోనే సీఎం జిల్లాల పర్యటన

ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు 

ఇక అన్నీ కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి


ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ప్రభుత్వం 2017 అక్టోబరులో  సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే నిధుల విడుదల ఆలస్యంతో ఇన్నాళ్లు నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు పూర్తి కావొచ్చాయి. సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఈ నూతన భవనాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేస్తున్నారు. 


యాదాద్రి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. 2017 అక్టోబరులో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కలెక్టరేట్‌లతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భవన నిర్మాణంతోపాటు ఫర్నిచర్‌, విద్యుత్‌, నీటివసతి, సీసీరోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ల్యాండ్‌స్కే్‌ప, తదితర పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే 2016 అక్టోబరు 11వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాను విభజించి 17 మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లాను ఏర్పాటు చేసింది. 


సౌకర్యవంతంగా గదులు, విశాల వరండాలు

ప్రజలు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనంలో జిల్లా అధికారుల కార్యాలయాలకు విశాల వరండాలు, గదులతో కూడిన భవనాలను నిర్మించారు. మొత్తం జీప్లస్‌ టూ అంతస్థుల్లో 1,58,756 అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్‌ భవనం నిర్మించారు. వీటిలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో 53,740 ఎస్‌ఎ్‌ఫటీ, మొదటి అంతస్తు 50,832 ఎస్‌ఎఫ్‌ టీ, రెండో అంతస్తులో 15,428 ఎస్‌ఎ్‌ఫటీలో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.53కోట్లు మంజూరు చేసింది. వీటిలో దాదాపు రూ.53కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్థుల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్లతోపాటు ఆయా శాఖల కార్యాలయాలు, సమావేశ మందిరం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భవనానికి రంగులు వేయడం కూడా పూర్తయింది. కలెక్టరేట్‌ భవనానికి విద్యుత్‌ సౌకర్యంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రి సమకూర్చాల్సి ఉంది. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ల నివాస భవనాల నిర్మాణాలు పనులు పూర్తయ్యాయి. కలెక్టరేట్‌ భవనం చుట్టూ కూడా కంపౌండ్‌వాల్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. భవన సముదాయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతారణం, పచ్చని చెట్లు, ఉద్యానవనం, పార్కింగ్‌కోసం ప్రత్యేక స్థలం, మూత్రశాలలు, క్యాంటిన్‌, భోజనశాల, ఏటీఎం, బ్యాంకు, మీసేవ ఏర్పాటు చేయాల్సిఉంది. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయ్యేలోగా పనులన్నీ పూర్తి చేసేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. నూతన కలెక్టరేట్‌ భవనంలోకి దాదాపు 44 శాఖలు రానున్నాయి. ఈ శాఖల్లో దాదాపు 1200 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. 


 తీరనున్న ప్రజల ఇబ్బందులు

ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోటలేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, రెవెన్యూ విభాగాలు ఒకచోట, ఇతర అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారుల కార్యాలయాలు మరోచోట ఉండటంతో రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి. ఈ కార్యాలయాలు కూడా చాలావరకు ప్రైవేట్‌ భవనాల్లోనే ఉన్నాయి. దీంతో నెలనెలా పెద్దమొత్తంలో అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని జిల్లా కలెక్టరేట్‌లు కూడా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ (సమీకృత భవన సముదాయం) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల సముదాయాల నిర్మాణాలకు శ్రీకారంచుట్టింది. జిల్లాలోని భువనగిరి మండలం రాయుగిరిలో 12.20 ఎకరా ల్లో శాశ్వతభవనాన్ని నిర్మించారు. గతంలో ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.32.18కోట్లను మంజూరుచేసింది. సంవత్సరంలోనే భవనాలు పూర్తి చేయాల్సి ఉండగా, సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో భవనాల నిర్మాణాల్లో జాప్యం జరిగింది. దీంతో వ్యయ భారం కూడా పెరిగింది. భవన నిర్మాణానికి మరోసారి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఈ భవనానికి రూ.53కోట్ల మేరకు మంజూరు చేసింది. 


పేటలో 60 శాతం పూర్తి

సూర్యాపేట టౌన్‌: సూర్యాపేట జి ల్లా కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ నిర్మాణం పను లు 60శాతం మాత్రమే పూర్తయ్యా యి. కరోనా, అకాల వర్షాలతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈవీఎం, వీవీ ప్యా ట్‌ గదులు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయాల్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో పలుచోట్ల కలెక్టరేట్‌ల నిర్మాణాలు ప్రారంభించగా, ఇక్కడ మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సూర్యాపేట మునిసిపల్‌ పరిధిలోని కుడకుడ గ్రామంలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.46 కోట్లతో ఈ భవ నాన్ని నిర్మిస్తున్నారు. అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా డిజైన్‌ చేశారు. కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెక్టర్లు, మరో ఇద్దరు జిల్లా అధికారులకు కూడా ఈ ప్రాంగణంలో భవనాలు నిర్మించను న్నారు. అయితే ప్రస్తుతం మూడు అంతస్థుల స్లాబులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా అనేక పనులు చేపట్టాల్సి ఉంది. నిర్మాణంలో పాల్గొన్న అనేకమంది కార్మికు లు కరోనా వల్ల తమ స్వరాష్ట్రాలకు వెళ్లడంతో జాప్యం జరిగింది. వాస్తవానికి 2017 అక్టోబరు 12వ తేదీన సీఎం కేసీఆర్‌ నూతన కలెక్టరేట్‌ భవనానికి శంకుస్థాపన చేయగా 2018 జనవరిన పనులు ప్రారంభమయ్యాయి. కేవలం సంవత్సరంలోపే ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరిగింది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-16T05:34:19+05:30 IST