Abn logo
Jul 24 2021 @ 00:18AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌, జేసీలు

స్థానికంగా అందుబాటులో అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ 

గుంటూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్న దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి గుంటూరు, నరసరావుపేట, తెనాలి, గురజాల రెవెన్యూ డివిజన్ల ఆర్‌డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. అనంతరం సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. మీ-సేవ కేంద్రాల్లో ప్రజలు, రైతుల నుంచి వస్తోన్న సమస్యలను త్వరితగతిన విచారించి తాత్సారం చేయకుండా పరిష్కరించాలన్నారు. జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా రెవెన్యూ అధికారులు వేగం పెంచాలన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తోన్న మండలాలపై తహసీల్దార్లు, ఆర్డీవోలు శ్రద్ధ చూపించాలన్నారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, కలెక్టరేట్‌ అధికారులు పాల్గొన్నారు.