ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2022-09-28T05:40:46+05:30 IST

జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.

ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయండి
భీమవరం ప్రభుత్వాసుపత్రి వద్ద కలెక్టర్‌ ప్రశాంతి

కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశం 

భీమవరం క్రైం/భీమవరం, సెప్టెంబరు 27 : జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వాసుపత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో ప్రసూతి వార్డులు, ఇన్‌ పేషెంట్‌ వార్డు లు, ఓపీ వార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ హాస్పిటల్‌కి వచ్చే రోగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు అందించా లంటే మరింత అభివృద్ధి చేసి సుందరీకరంగా తీర్చిదిద్దాలన్నారు. హాస్పిటల్‌ డ్రెయినేజీ వ్యవస్థ సక్రమ నిర్వహణపై మున్సిపల్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్‌, శానిటేషన్‌, మౌలిక సదుపాయాలకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పురపాలక సంఘం కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, ఇంజనీరింగ్‌ అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

 గుడ్లు చిన్నవైతే నివేదిక ఇవ్వండి..

‘అంగన్‌వాడీ పిల్లలకు అందించే పౌష్టికాహారంలో గుడ్లు చాలా చిన్నవిగా వస్తున్నాయి.. వాటిని అంగన్‌వాడీ టీచర్లు పరిశీలించి సక్రమంగా లేని వాటికి లేవని, ఉన్నవాటిని ఉన్న ట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి’  అని కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. సీడీపీవోలు ప్రతీ అంగన్‌వాడీ కేంద్రాన్ని విధిగా తనిఖీ చేసి పూర్తిస్థాయిలో నివేదిక పంపించాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతరాణి, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు. 

 410 పనులకు ప్రతిపాదనలు..

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హామీల మేరకు ఇప్పటివరకు 410 పనులకు ప్రతిపాదనలు వచ్చాయని, అందులో 252 పనులకు ఆమోదం ఇచ్చామని కలెక్టర్‌ ప్రకటించారు. వీటికి టెక్నికల్‌ శాంక్షన్‌, డిటెయిల్‌ ఎస్టిమేషన్‌ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతిపాదించిన పనులపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.  సీపీవో కె.శ్రీనివాసరావు, డీఎల్‌డీవో కే సీహెచ్‌ అప్పారావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎస్‌ఏ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:40:46+05:30 IST