చినరుషికొండ సచివాలయ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-23T10:21:40+05:30 IST

చినరుషికొండలోని వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బంది..

చినరుషికొండ సచివాలయ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం

అడ్మిన్‌, వెల్ఫేర్‌ సెక్రటరీలకు మెమోలు జారీ చేయాలని జడ్సీకి ఆదేశం


ఎండాడ, అక్టోబరు 22: చినరుషికొండలోని వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సిబ్బందికి సూచించారు. సచివాలయం అడ్మిన్‌  చైతన్యను లబ్ధిదారుల వివరాలను కలెక్టర్‌ అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు, అలాగే లబ్ధిదారుల వివరాలను సక్రమంగా డిస్‌ప్లే చేయకపోవడంతో వెల్ఫేర్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌కు మెమోలు జారీ చేయాలని జీవీఎంసీ జోన్‌-1 జోనల్‌ కమిషనర్‌ రామును ఆదేశించారు.


ఆధార్‌ కార్డుల మంజూరు, రైస్‌ కార్డుల వివరాలు, దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి సిబ్బందిపై వినయ్‌చంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ పనితీరు మెరుగుపరుచుకోవాలని, నిబద్ధతతో లోటుపాట్లను సరిచేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని స్పష్టం చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఈశ్వరరావు, జడ్సీ సచివాలయాలకు వెళుతూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ వెంట పలు విభాగాల అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-10-23T10:21:40+05:30 IST