పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటుదాం..

ABN , First Publish Date - 2020-07-08T10:27:53+05:30 IST

నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటు దామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. 6వ విడత హరితహారంలో భాగంగా మంగళవారం ..

పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటుదాం..

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌ టౌన్‌, జూలై 7: నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటు దామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. 6వ విడత హరితహారంలో భాగంగా మంగళవారం శాతవాహన యూనివర్సిటీలో మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరు క్రాంతి, యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ భరత్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం యూనివర్సిటీ ఆవరణలో 3వేల మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నగర ప్రజల కోరిక మేరకు ప్రతీ ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతి ఇంటి ముందు పచ్చతోరణం కనిపించే విధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రెండు వారాలుగా నగరంలో యజ్ఞంలా మొక్కలు నాటుతున్న మేయర్‌, కమిషనర్‌, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బందికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు.


అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, హరితహారం పనులు వేగంగా పూర్తిచేయాలి..

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, హరితహారం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, హరితహారం పనులపై మేయర్‌ వై సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరు క్రాంతి, మున్సిపల్‌ అధికారులు, కన్సల్టెంట్స్‌తో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీలకు నిర్ణయించిన గడువులోగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు పూర్తిచేయకుంటే నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. 6వ విడత హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌, యాదాద్రి మోడల్‌లో రోడ్లకు ఇరువైపులా మొక్కలునాటి వాటికి ట్రీగార్డ్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులకు అప్పగించిన టార్గెట్‌ ప్రకారం జూలై 28 వరకు ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని, లేకపోతే వారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-07-08T10:27:53+05:30 IST