రూ.450 కోట్ల పారిశ్రామిక రాయితీలు

ABN , First Publish Date - 2020-05-29T10:50:53+05:30 IST

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నెలలో రూ.450కోట్ల ఇండస్ట్రియల్‌ ఇన్‌సెంటివ్స్‌ విడుదల ..

రూ.450 కోట్ల పారిశ్రామిక రాయితీలు

వచ్చే నెల విడుదల : కలెక్టర్‌


నెల్లూరు(వ్యవసాయం), మే 28 : ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నెలలో రూ.450కోట్ల ఇండస్ట్రియల్‌ ఇన్‌సెంటివ్స్‌ విడుదల చేసిందని, జూన్‌లో మరో రూ.450కోట్ల  రాయితీలు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ఏడాది కాలన పూర్తైన నేపథ్యంలో జడ్పీ హాల్‌లో జరుగుతున్న మన పాలన - మీ సూచన మేధోమథన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై సదస్సు జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారులు పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.


పరిశ్రమలశాఖ జీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ -చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్‌లు జిల్లా నుంచే వెళ్తాయని, దీంతో పారిశ్రామికాభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉంటాయన్నారు. 2020-2021 ఏడాదికి రూ.555.95కోట్లతో 952 పరిశ్రమలు స్థాపించి 6006 మందికి ఉద్యోగాలు అదేవిధంగా 2021-2022కి రూ.600.46కోట్లతో 1027 పరిశ్రమల స్థాపన ద్వారా 6487 ఉద్యోగాలు, 2022-2023కి రూ.648.49కోట్లతో 1108 పరిశ్రమలు తద్వారా 7006 ఉద్యోగాలు, 2023-2024కి రూ.701కోట్లతో 1198 పరిశ్రమలు తద్వారా 7567 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని రోడ్‌మ్యాప్‌ రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌, జేసీ-2 కమలకుమారి, డీఆర్‌డీఏ పీడీ శీనానాయక్‌, అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T10:50:53+05:30 IST