స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటనతో ఉలికిపాటు

ABN , First Publish Date - 2020-08-10T10:09:26+05:30 IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ దుర్ఘటన జిల్లా వాసులను ఉలికిపాటుకు గురి చేసింది.

స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటనతో ఉలికిపాటు

తాజ్‌లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని ఖాళీ చేయించిన అధికారులు

అనుమతులు రద్దు చేసిన కలెక్టర్‌

కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్ల తనిఖీకి ప్రత్యేక బృందాల ఏర్పాటు

ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి


విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దుర్ఘటనతో గుంటూరు జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొవిడ్‌ సెంటర్లలో భద్రత ప్రమాణాలను తనిఖీ చేసేందుకు అధికారుల బృందాన్ని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఘమేఘాలపై హోటల్‌ తాజ్‌ రీజెన్సీలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతిని రద్దు చేశారు. స్టార్‌ హోటళ్లు కొవిడ్‌ సెంటర్లుగా మారుతున్న వైనాన్ని రెండు రోజల కిందట ఆంధ్రజ్యోతి కరోనా భయం.. క్యాష్‌ అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.

 

గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ దుర్ఘటన జిల్లా వాసులను ఉలికిపాటుకు గురి చేసింది. వెంటనే ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. హోటల్‌ తాజ్‌ రీజెన్సీలో అమరావతి హాస్పిటల్‌కు కేటాయించిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతులను కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ రద్దు చేశారు. అక్కడ ఉన్న 32 మంది కొవిడ్‌ అనుమానితులను ప్రత్యేక అంబులెన్స్‌లు ద్వారా ఇతర ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు. జిల్లాలో కోవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌లలో అగ్నిప్రమాద నివారణ చర్యలు నిబంధనల మేరకు పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బృందంలో అగ్నిమాపక శాఖ అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు, ఏపీఎస్‌పీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, మునిసిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రెటరీలు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.


ఈ నెల 10వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తనిఖీ చేసి నివేదిక అందజేయాల్సిందిగా బృందాన్ని కలెక్టర్‌ ఆదేశించారు. ఇకపై ఏ హోటల్‌ను కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా నిర్వహించుకొనేందుకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించారు. రెండు రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి సంచికలో కోవిడ్‌ సెంటర్లుగా మారుతున్న స్టార్‌ హోటళ్లు అనే శీర్షికతో ఆస్పత్రుల వ్యాపార ధోరణిపై కథనాన్ని ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. 


అంతా వ్యాపార ధరోణి..

ఎప్పుడైతే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు తలుపులు తెరిచిందో వెంటనే కొన్ని ఆస్పత్రులు వ్యాపార ధోరణిలోకి మారిపోయాయి. జిల్లా కేంద్రంలో స్టార్‌ హోటళ్లని లీజుకు తీసుకొని వాటిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఎలాగు హోటల్‌ బిజినెస్‌ పడిపోవడం, గదులు నిండకపోతుండటంతో హోటళ్ల యాజమాన్యాలు కూడా లీజుకు ఇవ్వడం ప్రారంభించాయి. కొన్ని ఆస్పత్రులు అయితే చిన్నచిన్న భవనాలు తీసుకొని వాటిని అనధికారికంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లుగా మార్చాయి. జైన్‌ సామాజికవర్గీయుల కోసం అమరావతి రోడ్డులో హోటల్‌ మనోజ్‌కు అనుమతిచ్చారు. దానిని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రారంభించారు. 


ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండకపోతే కొద్ది రోజుల్లోనే మరికొన్ని స్టార్‌ హోటళ్లతో పాటు వసతి కోసం నిర్మించిన భవన సముదాయాలు కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారేవి. దీనికి కారణం ఒక బాధితుడిని 14 రోజులు ఉంచితే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు బిల్లు వేయొచ్చని కొన్ని ఆస్పత్రులు భావించాయి. అసలు కోవిడ్‌ లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రులు బాధితులను బెదరగొడుతూ లక్షణాలు లేకపోయినా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరేలా ప్రేరేపిస్తున్నాయి. 


నరసరావుపేటలోనూలాడ్డిల్లో, హాస్టల్స్‌లో  కొవిడ్‌ అస్పత్రులు  ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అద్దె భవనాల్లో  వీటిని నిర్వహిస్తున్నారు. పైర్‌ ఎన్‌వోసీ లేకుండానే లాడ్టిలలో, వసతి గృహాలలో వీటిని ఏర్పాటు చేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.  గృహాల మధ్యలో కొవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు గురౌతున్నారు.  

Updated Date - 2020-08-10T10:09:26+05:30 IST