సాంకేతిక రీ సర్వే ద్వారా భూ హక్కు పత్రాలు జారీ

ABN , First Publish Date - 2022-01-19T05:50:03+05:30 IST

తొలి దశ కింద జిల్లాలో 2,504 మంది భూ యజమానులకు చెందిన 4,004.63 ఎకరాల భూములకు భూ హక్కు పత్రాలను గ్రామ సచివాలయ సబ్‌ రిజిస్ట్రార్‌ల ద్వారా జారీ చేస్తున్నామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.

సాంకేతిక రీ సర్వే ద్వారా భూ హక్కు పత్రాలు జారీ
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

 కలెక్టర్‌ హరికిరణ్‌  
కాకినాడ సిటీ, జనవరి 18: తొలి దశ కింద జిల్లాలో 2,504 మంది భూ యజమానులకు చెందిన 4,004.63 ఎకరాల భూములకు భూ హక్కు పత్రాలను గ్రామ సచివాలయ సబ్‌ రిజిస్ట్రార్‌ల ద్వారా జారీ చేస్తున్నామని  కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధునిక సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమం వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పఽథకం తొలి దశ కింద 51 గ్రామాల్లో భూమి రికార్డులను మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ ప్రజలకు అంకితం చేశారు. 37 గ్రామ సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తదితరులు కలెక్టరేట్‌ వివేకానంద  సమావేశ హాలు నుంచి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 69 పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు మినహాయించి మిగిలిన 1,616 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు.  సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ సహకారంతో డ్రోన్లు, రోవర్లు, జీపీఎస్‌ వంటి అత్యాధునిక సాంకేతికతతో జిల్లాలో ఈ సమగ్ర సర్వే నిర్వహణకు 12 మండల సర్వేయర్లు, 18 మంది సర్వేయర్లకు సామర్లకోట స్టేట్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మాస్టర్‌ ట్రైనర్లుగా శిక్షణ కల్పించామన్నారు. వారి సహాయంతో 1,064 మంది విలేజ్‌ సర్వేయర్లకు మూడు విడతలుగా సమగ్ర శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. రీ సర్వే నిర్వహణకు 7 కార్స్‌ టేస్‌ స్టేషన్లను తొండంగి, రౌతులపూడి, పిఠాపురం, ఐ పోలవరం, గోకవరం, చింతూరు ఎటపాక మండలాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరరావు, సర్వే ఏడీ ఏవీఎస్‌ గోపాలకృష్ణ, సర్వే ఇన్‌స్పెక్టర్లు వై.మోహనరావు, బీఎల్‌ నారాయణ, కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:50:03+05:30 IST