Abn logo
Sep 24 2021 @ 01:34AM

రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ముస్తాబాద్‌, సెప్టెంబరు 23 : ప్రభుత్వ సూచనల మేరకు పంటల మార్పిడికై రైతులు అడుగులు వేసి వ్యవసాయ రంగంలో ఆఽధునిక ఒరవడులు సృష్టించి ఆర్థికాభివృద్ది సాధించాలని రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్‌ గ్రామంలో గల రైతు వేదికలో యాసంగి పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ గతంలో పంజాబ్‌ రాష్ట్రం ముందంజలో ఉండేదని ప్రస్తుతం తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. వరిలో సన్నరకాల వైపు మొగ్గు చూపించాలన్నారు. అలాగే కూరగాయాల పంటలు, అంతర పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అయిల్‌పామ్‌ సాగును ప్రభుత్వం సబ్సిడి ఇస్తూ పోత్సహిస్తుందన్నారు. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెంలో అయిల్‌పామ్‌ సాగును చేస్తూ తక్కువ నీటి వినియోగంతో ఎకరానికి రూ 1.50 లక్షలు సంపాదిస్తున్నారన్నారు. మనం కూడా అవగాహన కోసం అక్కడికి వెళ్తి అవగాహన పెంచుకొని అలాంటి అయిల్‌పామ్‌ పంటలను సాగుచేయాలన్నారు. కోతుల బెడద ఉండదని, ఎరువుల వాడకం తక్కువగా ఉంటుందని దీంతో భూమిని కాపాడుకున్నావాళ్లమవుతామన్నారు. పంటల మార్పిడి అనుసరిస్తే భూమి సారం ఉంటుందని పంటలు బాగా పండుతాయన్నారు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల కోఆర్డినేటర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్‌ బద్ది కళ్యాణిభాను,  ఎంపీటీసీ లలిత, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌, మండల వ్యవసాయధికారి వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ వెంకటనర్సింగరావు, గాడిచర్ల దేవయ్య, ఏఈవోలు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.