కారే.. NTR జిల్లా కలెక్టర్ కార్యాలయం..!

ABN , First Publish Date - 2022-05-22T06:31:12+05:30 IST

ఎన్టీఆర్‌ జిల్లాకు నూతన కలెక్టర్‌గా వచ్చిన దిల్లీరావు కారునే కార్యాల యంగా మార్చేశారు.

కారే.. NTR జిల్లా కలెక్టర్ కార్యాలయం..!

  • ఫీల్డ్‌ విజిట్స్‌తో కారులోనే కాన్ఫరెన్స్‌లు..
  • ఇదీ.. ఎన్‌టీఆర్‌ కలెక్టర్‌ దినచర్య 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఎన్టీఆర్‌ జిల్లాకు నూతన కలెక్టర్‌గా వచ్చిన దిల్లీరావు కారునే కార్యాలయంగా మార్చేశారు. జిల్లాబాటలో గ్రామగ్రామానా తిరుగుతూ స్థానిక ప్రాంతాలపైౖ అవగాహన పెంచుకుంటూ, సమయం వృథా కాకుండా కీలక శాఖలకు సంబంధించి టెలీకాన్ఫరెన్స్‌లన్నీ కారులోనే చేసేస్తున్నారు. జిల్లా నుంచి విజయవాడకు వచ్చేటపుడు ఒకటి రెండు సమీక్షలు చేస్తున్నారు.  జిల్లాబాటలో భాగంగా తిరుగుతుండటం వల్ల కలెక్టరేట్‌లో తక్కువ సమయం ఉండాల్సి వస్తోంది. దీంతో సమీక్షలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ఆయన కారులోనే సమీక్షలు చే సేస్తూ పెండింగ్‌ లేకుండా చేస్తున్నారు. గతంలో టెలీకాన్ఫరెన్స్‌లు అంటే అధికారులు భయపడేవారు.


ప్రస్తుత కలెక్టర్‌ దిల్లీరావు తన హోదా పక్కన పెట్టి ఎలాంటి బేషజాలు, అధికార దర్బం ప్రదర్శించకుండా చిరునవ్వుతో అధికారులకు  సిబ్బందికి  సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లాబాటలో భాగంగానే కాకుండా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఇళ్ల ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సందర్భంలో కూడా మార్గమధ్యలో సమయం వృథా చేయకుండా అధికారులతో మిర్చి పంటపై నల్ల తామర తెగులు నివారణ చర్యలపైనా, కార్మికుల కనీస వేతనాల అమలు, బాల నేరస్తుల సంరక్షణ వంటి అంశాలపైనా తన వాహనంలోనే లాప్‌ట్యాప్‌ ద్వారా శనివారం గూగుల్‌ కాన్ఫరెన్స్‌లో సమీక్షలను నిర్వహించారు. తన సమయాన్నే కాకుండా జిల్లా అధికారుల సమయాన్ని కూడా సద్వినియోగ పరుస్తున్నారు. పనిలోపనిగా సమావేశాలకు అయ్యే ఖర్చులను కూడా ఆదా  చేస్తున్నారనుకోండి !

Updated Date - 2022-05-22T06:31:12+05:30 IST