ఏటా జూన్‌ 10నే ఖరీఫ్‌ సాగునీటి విడుదల

ABN , First Publish Date - 2022-05-17T06:06:47+05:30 IST

ఇక నుంచి ఏటా ఖరీఫ్‌ సీజన్‌ని జూన్‌ 10నే ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏటా జూన్‌ 10నే ఖరీఫ్‌ సాగునీటి విడుదల
మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన జిల్లా అధికారులు

గుంటూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ఏటా ఖరీఫ్‌ సీజన్‌ని జూన్‌ 10నే ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వారిద్దరూ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే నాటికే సాగునీటి కాలువల్లో పూడిక, జమ్ము తొలగింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాలు పెరిగినందున నీటి పంపిణీ విషయంలో కలెక్టర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. చివరి భూములకు నీరు చేరేలా నీటి విడుదల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర జీడీపీలో 34 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలదేనన్నారు. ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పంటల సాగుతీరుని దృష్టిలో ఉంచుకొని ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను ఆర్‌బీకేలలో సిద్ధం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి కొరత రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లల, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:06:47+05:30 IST