కలెక్టర్‌ హెచ్చరికలతో అధికారులు బేజారు

ABN , First Publish Date - 2022-05-21T06:32:52+05:30 IST

రిజనుల సమస్యలపై అర్జీల స్వీకరణకు కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేసిన హెచ్చరికలతో అధికారుల్లో అప్రమత్తమయ్యారు

కలెక్టర్‌ హెచ్చరికలతో అధికారులు బేజారు
స్పందన కార్యక్రమానికి హాజరైన అధికారులు

స్పందన కార్యక్రమానికి గైర్హాజరైతే శాఖపరమైన చర్యలు తప్పవని గత వారం ఆదేశం

ఈ వారం అనూహ్యంగా 62 మంది అధికారులు హాజరు



పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యలపై అర్జీల స్వీకరణకు కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేసిన హెచ్చరికలతో అధికారుల్లో అప్రమత్తమయ్యారు. శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 62 మంది అధికారులు హాజరయ్యారు. 

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రతి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజనులు వివిధ సమస్యలపై అందజేసే అర్జీలు,  ఫిర్యాదులను ఆయన పరిశీలించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదలాయిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడాన్ని గుర్తించిన ఆయన స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని మౌఖికంగా చెప్పారు. అయినప్పటికీ ఈ నెల ఆరో తేదీన నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 11 మంది అధికారులు డుమ్మా కొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన ఆయా అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ నెల 13న నిర్వహించిన స్పందన కార్యక్రమంలో.. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలతో వస్తారని, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఘాటుగా హెచ్చరించారు. దీంతో ఈ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 62 మంది అధికారులు హాజరయ్యారు. 

స్పందనలో 64 వినతులు....

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 64 వినతులు అందాయి. హుకుంపేట మండలం గంగరాజుపుట్టు, మేభా, భీమవరం గ్రామాల్లో రక్షిత నీటి పథకాలను ఏర్పాటు చేయాలని వైస్‌ఎంపీపీ సుడిపల్లి కొండలరావు కోరగా, అటవీ హక్కు పత్రాలు జారీ చేయాలని జి.మాడుగుల మండలం పెదలోచలి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు అర్జీలు అందజేశారు. ఇంకా వ్యక్తిగత, సామాజిక సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:32:52+05:30 IST