Abn logo
Sep 23 2021 @ 00:33AM

ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దృష్టి

మాట్లాడుతున్న కలెక్టర్‌

  సీఎం కాన్ఫరెన్స్‌లో వివరించిన కలెక్టర్‌
కాకినాడ సిటీ, సెప్టెంబరు 22: జిల్లాలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులతో స్పందన వీడియో సమావేశం నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాలు నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, ఎ.భార్గవ్‌తేజ్‌, కాకినాడ, రాజమహేంద్రవరం కమిషనర్లు స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, అభిషిక్త్‌ కిషోర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాఽధాన్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు పట్టాలు అందించే కార్యక్రమ సన్నద్ధత కార్యకలాపాలు పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ-క్రాప్‌ బుకింగ్‌, రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలు, సీసీఆర్‌సీ కార్డులు, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలపై సూచనలు చేశారు. అక్టోబరులో నిర్వహించనున్న వైఎస్సార్‌ ఆసరా, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, జగనన్న తోడు, వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాలకు సంబంధించి సచివాలయాల వారీగా లబ్ధిదారుల గుర్తింపు, అర్హుల జాబితా రూపకల్పన, ప్రదర్శన, సోషల్‌  ఆడిటింగ్‌ తదితర ప్రక్రియలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, హౌసింగ్‌ పీడీ జి.వీరేశ్వరప్రసాద్‌, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ జేడీ ఎన్‌.విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.