ప్లాస్మా దానానికి ఒప్పించాలి

ABN , First Publish Date - 2020-08-09T11:59:32+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారిని ప్లాస్మా దానానికి ఒప్పించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్యాధికారులకు ..

ప్లాస్మా దానానికి ఒప్పించాలి

ఒక్కొక్కరికి రూ. 5 వేలు ప్రోత్సాహం

వైద్యాధికారుల సమీక్షలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 8 : కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారిని ప్లాస్మా దానానికి ఒప్పించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్‌ బంగ్లాలో శనివారం వైద్యశాఖాధికారులు, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం వరకు 11,224 మంది పాజిటివ్‌ బారినపడ్డారనీ, వారిలో 5976 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారనీ అన్నారు. కోలుకున్న వారిలో యాంటీ బాడీస్‌ ఉంటాయన్నారు. ఒకరి నుంచి ప్లాస్మా సేకరించడం ద్వారా మరో ఇద్దరి ప్రాణాలు రక్షించవచ్చన్నారు. ప్లాస్మా దానానికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5వేలు ప్రోత్సాహకంగా అందిస్తుందన్నారు.


జిల్లాలో ఇప్పటివరకు రెడ్‌క్రాస్‌ ద్వారా ఏడుగురి నుంచి ప్లాస్మా సేకరించి నలుగురు బాధితులకు చికిత్స అందించామన్నారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఎంతో మెరుగైందన్నారు. జిల్లాలో ప్రతి రోజూ 40 మంది నుంచి ప్లాస్మా సేకరించడానికి అవకాశం ఉందన్నారు.  ప్లాస్మా సేకరించడానికి యాంటీ బాడీ కిట్స్‌, ప్లాస్మా థెరపీ కిట్స్‌ అందించాలని ప్రైవేట్‌ వైద్యశాలల యాజమాన్యాల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్‌ అధికారులతో చర్చించి వాటిని అందిస్తామన్నారు. సమావేశంలో జేసీ ఆసరా శీనానాయక్‌,  అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో స్వర్ణలత పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:59:32+05:30 IST