రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-10-24T11:22:31+05:30 IST

రోడ్ల విస్తరణ పనులు మరింత వేగవంతం కానున్నాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కొత్త కలెక్టరేట్‌ నుంచి సీడబ్ల్వుసీ కాంపౌండు వరకు, ..

రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలి

కలెక్టర్‌ సి.హరికిరణ్‌


కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 23: రోడ్ల విస్తరణ పనులు మరింత వేగవంతం కానున్నాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కొత్త కలెక్టరేట్‌ నుంచి సీడబ్ల్వుసీ కాంపౌండు వరకు, అక్కడ నుంచి రిమ్స్‌వెళ్లే దారిలోని అండర్‌ బ్రిడ్జి వరకు 100 అడుగుల  వెడల్పుతో, అలాగే రైల్వే స్టేషన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్ల విస్తరణ కార్యాచరణపై ఇరువైపుల ఉన్న స్థల యజమానులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా, ప్రజలకు భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రహదారులు మరింత సౌకర్యవంతంగా, అహ్లదకరంగా, ఆధునాతన హంగులతో తీర్చిదిద్దనున్నామన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ కాలువలు, అవసరమైన చోట డివైడర్లు, అందులో పచ్చదనం, తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) గౌతమి, సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌, కడప, సీకేదిన్నె తహసీల్దార్లు శివరామిరెడ్డి, మహేశ్వరరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


సంతృప్తి స్థాయిలో సేవలందించాలి

సచివాలయాలు సంతృప్తి స్థాయిలో ప్రజలకు సేవలందించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జేసీ సాయికాంత్‌ వర్మ, సహాయ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌తో కలసి కలెక్టర్‌ హరికిరణ్‌  శంకరాపురంలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బయోమెట్రిక్‌ విధానాన్ని, హాజరు పట్టికలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయా సచివాలయాల సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:22:31+05:30 IST