‘కరోనా’ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-03-08T05:22:04+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అభినందించారు.

‘కరోనా’ సేవలు అభినందనీయం
రెండవ డోసు టీకా వేయించుకుంటున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు


టీకాతో రోగనిరోధక శక్తి : కలెక్టర్‌ 


నెల్లూరు (వైద్యం), మార్చి 7 : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అభినందించారు. నెల్లూరులోని క్రాంతినగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆయన ఆదివారం రెండో డోసు కరోనా టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా టీకా తో యాంటీబాడీస్‌ పెరుగుతాయన్నారు. రెండో డోసుతో వ్యాధినిరోధక శక్తి పెరిగి కరోనాను సమర్ధంగా ఎదుర్కోవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక ప్రచారాలను నమ్మవద్దని, స్వచ్ఛందంగా అందరూ కరోనా టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిత్యం 3500 మంది నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని,  రోజుకు కేవలం ఐదారుగురు మాత్రమే కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో తేలుతోందని చెప్పారు. పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని కోరారు. జిల్లాలో 58వేల మందికి కరోనా టీకా వేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 50 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా వేయించుకున్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే అత్యవసర వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. మూడో  విడత టీకా పంపిణీలో 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్ల పైబడిని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులలో ఇప్పటి వరకు ఏడు వేల మందిని గుర్తించగా రెండు వేల మందికి కరోనా టీకా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ డెమో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:22:04+05:30 IST