సచివాలయ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-19T06:32:28+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రజలు వివిధ రకాల సేవల కోసం ప్రైవేటు మీసేవా కేంద్రాలకు వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పాటిపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం
పాటిపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

ప్రజలు మీసేవా కేంద్రాలను ఎందుకు ఆశ్రయించాల్సి వస్తున్నదని నిలదీత

రెవెన్యూ సిబ్బంది తీరుపై ఫిర్యాదు చేసిన స్థానికులు

వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశాలు


మునగపాక, మే 18: గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రజలు వివిధ రకాల సేవల కోసం ప్రైవేటు మీసేవా కేంద్రాలకు వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పాటిపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నారాయుడుపాలెంలోగల పాటిపల్లి సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు గ్రామస్థులు అక్కడకు వచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రెవెన్యూ సమస్యలపై ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పనులు చేయడం లేదని జగన్నాథరావు అనే రైతు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మ్యుటేషన్‌ కోసం గతంలో చేసుకున్న దరఖాస్తులు, అధికారులకు అందజేసిన అర్జీల గురించి ఆయన వివరించారు. రెవెన్యూ సమస్యలపై పలువురు ఫిర్యాదులు, ఆరోపణలు చేయడంతో వీఆర్వో శంకర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ జయప్రకాశ్‌ను ఆదేశించారు. కాగా గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని  వేసవిలో మరింత అధికంగా వుంటున్నదని పలువురు మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో పారిశుధ్య మెరుగునకు చర్యలు తీసుకోవాలని, నెల రోజుల్లో పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. నెల రోజుల్లో మళ్లీ పర్యటిస్తానని అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ కె.జయప్రకాశ్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో రవికుమార్‌, మండల ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, ఈవోపీఆర్డీ ప్రసాద్‌, సర్పంచ్‌ కారుకొండ వెంకటి, తదితరులు వున్నారు. 


Updated Date - 2022-05-19T06:32:28+05:30 IST