Abn logo
Dec 3 2020 @ 01:07AM

జడ్పీ సమావేశానికి ముందే సమాధానాలివ్వండి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హన్మంతరావు, చిత్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ

 కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశం

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 2 : జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై శాఖల వారీగా అధికారులు తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వకంగా ఈ నెల 5వ తేదీలోగా జడ్పీ సీఈవో ఎల్లయ్యకు సమాధానాలు ఇవ్వాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుఽధవారం ఆయన జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీతో కలిసి  వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అడిగిన పలు అంశాలపై శాఖలవారీగా సభ్యుల వారీగా ఆయా అంశాలకు లిఖిత పూర్వకంగా సమాధానాలు జడ్పీ సీఈవోకు పంపాలని చెప్పారు. రాబోయే సమావేశంలో ముందుగానే గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, పలు పనుల్లో పురోగతిని తెలియజేయాలన్నారు. అనంతరం సమావేశం నిర్వహిస్తే సాఫీగా జరగడంతో పాటు సభ్యులకు జరిగిన పనులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. జడ్పీ సమావేశం అయిన వారంలోగా ఆయా అంశాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగిన వెంటనే మినిట్స్‌ను పంపాలని జడ్పీ సీఈవో ఎల్లయ్యకు సూచించారు. గత సమావేశంలోనివాటికి పరిష్కారం చూపాలన్నారు. మిషన్‌ భగీరథకు సంబంధించి సభ్యులు సూచించిన పనులను త్వరితగతిని పూర్తి చేయాలని అర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని, రైతు నేస్తంను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావును కలెక్టర్‌ ఆదేశించారు. కొత్త మండలాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రభుత్వానికి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని డీఎంఅండ్‌హెచ్‌వో మోజీరాం రాథోడ్‌ను ఆదేశించారు. అనంతరం జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజూశ్రీ మాట్లాడుతూ జడ్పీలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయాశాఖల అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్న సభ్యుల అపోహను పోగొట్టాలని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు. గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశంపై తీసుకున్న చర్యల మీద సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యే విధంగా కొత్త సంప్రదాయానికి కలెక్టర్‌ శ్రీకారం చుట్టారని మంజూశ్రీ చెప్పారు.  సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement