Abn logo
Dec 3 2020 @ 02:19AM

వసూళ్లు సరే.. వసతులేవీ?పలమనేరు రహదారిలో పూర్తికాని టోల్‌గేట్‌ నిర్మాణం 

తాత్కాలిక నిర్మాణం ఏర్పాటుపై వాహనదారుల ఆగ్రహం 


చిత్తూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిలోని బంగారుపాళ్యం మండలం మహాసముద్రం వద్ద శాశ్వత టోల్‌గేట్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తికాకనే ఈ ఏడాది ఆగస్టులో హైవే అధికారులు ఇదే ప్రాంతంలో తాత్కాలిక టోల్‌గేటు ఏర్పాటు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికీ మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   టీడీపీ హయాంలో జిల్లావ్యాప్తంగా రూ.వేల కోట్లతో జాతీయ, ఆర్‌అండ్‌బీ రహదారులు, ఆర్‌వోబీల నిర్మాణం ప్రారంభమైంది. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి(నంగమంగళం, నంగిలి నడుమ) అభివృద్ధికీ అడుగులు పడ్డాయి. ఇక నంగిలి- బంగారుపాళ్యం రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు సమీపంలోని కుక్కలపల్లె క్రాస్‌ నుంచి నంగమంగళం వరకున్న 25 కి.మీ. రోడ్డు పనులు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కుక్కలపల్లె క్రాస్‌ నుంచి బంగారుపాళ్యం నడుమ కూడా చిన్నపాటి పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ అధికారులు విస్మరించి బంగారుపాళ్యం మండలం మహాసముద్రం వద్ద ఈ ఏడాది ఆగస్టు నెలారంభంలో టోల్‌గేట్‌ ఏర్పాటుచేశారు. ఆ పక్కనే నిర్మాణదశలో ఉన్న శాశ్వత టోల్‌గేట్‌ పనుల్లో జాప్యం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో తాత్కాలిక టోల్‌గేట్‌ ఏర్పాటుతో తమ నడ్డి విరుస్తున్నారంటూ వాహనదారులు మండిపడుతున్నారు. 


పాసుల మంజూరులోనూ సమస్యే

మహాసముద్రం టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు రూ.275కే నెలవారీ పాసులు పొందవచ్చు. ఈ పాస్‌ మంజూరైన రోజు నుంచి 30 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంది. అయితే ఆయా నెల 20 లేదా 25వతేది పాసు తీసుకుంటే అదే నెలాఖరుకే పాస్‌ గడువు ముగిసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై తరచూ టోల్‌గేటు పరిధిలోని వాహనదారులు గొడవలకు దిగుతున్నారు. మొత్తం మీద శాశ్వత టోల్‌గేటు పనులు పూర్తికాకనే, ముందస్తు రుసుం వసూలుకు అధికారులు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. 

చాలాకాలంగా నిర్మాణంలోనే ఉన్న శాశ్వత టోల్‌గేట్‌


Advertisement
Advertisement
Advertisement