నగర వనంలో వసూళ్లు

ABN , First Publish Date - 2022-06-28T04:41:29+05:30 IST

డోన్‌ పట్టణ సమీపంలో నగర వనాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం రూ. 1.80 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా పనులు పూర్తి కాకపోయినా చుట్టు పక్కల గ్రామాల వాళ్లు అక్కడికి వెళుతున్నారు.

నగర వనంలో వసూళ్లు
డోన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన నగర వనం

ప్రవేశ రుసుంపై విమర్శలు 

అసంపూర్తిగానే పనులు

అయినా వెళ్లిన వాళ్ల జేబుకు చిల్లు


డోన్‌, జూన్‌ 27: డోన్‌ పట్టణ సమీపంలో నగర వనాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం రూ. 1.80 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా పనులు పూర్తి కాకపోయినా చుట్టు పక్కల గ్రామాల వాళ్లు అక్కడికి వెళుతున్నారు. వాళ్ల దగ్గరి నుంచి అటవీ శాఖ వాళ్లు నగరవనంలోకి వెళ్లడానికి అనధికారికంగా ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఆహ్లాదానికి నగరవనాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు హర్షించారు. డోన్‌ పట్టణ సమీపంలోని యర్రగుంట్ల రహదారిలో ఉన్న ఈ నగరవనం చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని ఏర్పాటు చేయడానికి రూ.1.80 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. పనులు ఇంకా నడుస్తున్నాయి. పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ వనం ఆహ్లాదం పంచుతోంది. ఇక్కడ పిల్లల కోసం పలు ఆట వస్తువులను ఏర్పాటు చేశారు.


ప్రవేశరుసుం పేరుతో వసూళ్లు


నగర వనంలో అనధికార వసూళ్లు సాగిస్తున్నారు. అధికారికంగా నగరవనం ఇంకా ప్రారంభించలేదు. సెలవులు కావడంతో పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నగరవనానికి వస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని అటవీ శాఖ అధికారులు ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.15 మాదిరిగా ప్రవేశ రుసుం నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ఆహ్లాదం కోసం వస్తే ప్రవేశ రుసుం వసూలు చేయడమేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నగర వనంలో పూర్తి స్థాయి వసతులు లేకుండానే ప్రవేశ రుసుం ఎలా వసూలు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 


అసంపూర్తిగా నగర వనం


నగరవనం ఇంకా అసంపూర్తిగానే ఉంది. మరికొన్ని  పనులు ఇంకా చేయాల్సి ఉన్నది. వాకింగ్‌ ట్రాక్‌ల పనులు ఇంకా పూర్తి కాలేదు. పార్కుల్లో పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. వాటర్‌ ఫాల్స్‌ పనులు ఇంకా చేయాల్సి ఉంది. నగర వనంలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. 


డీఎఫ్‌వో ఆదేశాల మేరకే


డీఎఫ్‌వో ఆదేశాల మేరకే నగరవనంలో ప్రవేశరుసుం వసూళ్లు చేస్తున్నాం. పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.15 ప్రవేశ రుసుం చెల్లించాలని నిర్ణయించాం. నగర వనంలో తాగునీటి సౌకర్యాన్ని మరో మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. అసంపూర్తిగా ఉన్న పనుల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.  


- ప్రవీణ్‌ కుమార్‌, ఫారెస్టు రేంజర్‌, డోన్‌


Updated Date - 2022-06-28T04:41:29+05:30 IST