9 మంది నుంచి నమూనాల సేకరణ

ABN , First Publish Date - 2020-03-27T09:22:38+05:30 IST

జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది కరోనా అనుమానితుల నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ గురువారం నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం పరీక్షకు పంపింది.

9 మంది నుంచి నమూనాల సేకరణ

గుంటూరు(మెడికల్‌), మార్చి 26: జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది కరోనా అనుమానితుల నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ గురువారం నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం పరీక్షకు పంపింది. ఇప్పటి వరకు జిల్లాలో 34 మంది అనుమానితుల నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపింది. ఇందులో ఒకరికి కరోనా సోకినట్లు ఫలితం రాగా 22 మందికి నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. మరో 11 మంది అనుమానితులకు సంబంధించి నివేదికలు అందాల్సి ఉంది. గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నలుగురు రోగులు, ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వచ్చిన రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు.


ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో 17 మంది చికిత్సలు పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి మరో 17 మందిని డిశ్చార్జ్‌ చేశారు. రెండు రోజుల క్రింద గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆదినారాయణకు సంబంధించిన ఫలితాలు గురువారం అందాయి. ఇందులో అతను కరోనా వైరస్‌ సోకలేదని, క్షయ వ్యాధి కారణంగా చనిపోయాడని అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో 431 మంది హోం క్వారంటైన్‌లో ఆరోగ్యసిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు.


ప్రభుత్వ వైద్యుడి ఉదారత

గుంటూరు ప్రభుత్వాసుపత్రి న్యూరో సర్జరీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, కరోనా మహమ్మారి నివారణ చర్యల కోసం ప్రభుత్వానికి తన రెండు నెలల జీతం విరాళంగా అందజేశారు. ప్రధాన మంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఒక నెల జీతం, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం గురువారం అందజేశారు. 


బెంగళూరు నుంచి ఆరు రోజుల క్రితం వచ్చిన ముప్పాళ్ళ మండలం కుందూరువారిపాలేనికి చెందిన ఓ యువకుడు  జలుబు, దగ్గుతో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాడు. రెండు రోజుల నుంచి మళ్లీ దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటంతో అతడ్ని గుంటూరు తరలించారు. అతడు 35 మందితో కలసి తిరిగినట్టు గుర్తించి, వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో పెట్టినట్టు డాక్టర్‌ రమాదేవి తెలిపారు. అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన ఓ వ్యక్తిని బాపట్ల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు తహసీల్దార్‌ స్వర్ణలతమ్మ గురువారం తెలిపారు. ఒంగోలుకు చెందిన స్నేహితుడు లండన్‌ నుంచి రాగా అతడితో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ క్రమంలో  లండన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడితో తిరిగిన ఇంటూరువాసిని గుర్తించి, అతడి తల్లిదండ్రులను బాపట్ల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-03-27T09:22:38+05:30 IST