వీడని విభజన సమస్యలు

ABN , First Publish Date - 2022-05-17T05:24:13+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల సర్వీసు పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయి.

వీడని విభజన సమస్యలు
గుంటూరు కలెక్టరేట్‌

కారుణ్య నియామకాలపై సందిగ్ధం

క్రమశిక్షణ చర్యలు, ఉద్యోగులపై ఫిర్యాదుల విషయంలోనూ తర్జనభర్జనలు

నేటికీ చాలా పనులు ఉమ్మడి జిల్లా కలెక్టరే చేయాల్సిన పరిస్థితి

గుంటూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల సర్వీసు పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ప్రతీ దానికి సంబంధిత ప్రభుత్వ శాఖలకు నివేదించి అక్కడి నుంచి సమాధానాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోన్నది. కారుణ్య నియామకాలు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, జిల్లాల విభజనకు ముందు రిటైర్డు అయిన ఉద్యోగుల పెన్షన్లు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియామకం పొందిన టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జీతాలు డ్రా చేసే విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఆయా సర్వీసులు జాప్యం అవుతోన్నాయి. ప్రభుత్వ సర్వీసులో ఉండగా ఎవరైనా ఉద్యోగులు చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు ఏర్పాటు కావడంతో కారుణ్య నియామకాలు ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపై సందిగ్ధం నెలకొన్నది. దీంతో ఏ జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి సంప్రదించాలో తెలియని పరిస్థితి కొనసాగుతోన్నది. జిల్లాల విభజనకు ముందు విధి నిర్వహణల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియ ప్రారంభించినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎవరు విచారించాలనే దానిపై స్పష్టత కొరవడింది. ఈ విషయంలో తాజాగా ప్రభుత్వం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. జరిగిన సంఘటన, ఉద్యోగి ఒకే జిల్లాలో అయితే సంబంధిత కలెక్టర్‌కు పంపించాలని పేర్కొన్నది. ఇతర కేసుల్లో మాత్రం సంఘటన ఎక్కడ జరిగితే అక్కడ ఫైల్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలని స్పష్టం చేసింది. కొంతమంది ఉద్యోగులపై నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటి నుంచి వచ్చే ఫిర్యాదులు సంబంధిత జిల్లాకు పంపించాలని, గతంలో జరిగిన సంఘటనల విషయంలో ప్రదేశం ఆధారంగా సంబంధిత జిల్లాకు పంపాలని ఆదేశించింది. అయితే కొంతమంది సిబ్బందిపై గుంటూరు జిల్లాలో ఫిర్యాదులుండగా వారు ఇప్పుడు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్నారు. వారిపై విచారణ ఇక్కడి అఽధికారులు ఎలా నిర్వహిస్తారో తెలియకుండా ఉన్నది. జిల్లాల విభజనకు ముందు రిటైర్డు అయిన ఉద్యోగులు పెన్షన్‌ విషయంలో ఇబ్బందులు పడుతోన్నారు. సంబంధిత రిటైర్డు ఉద్యోగుల సర్వీసు విషయాలన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి పెన్షన్‌ ప్రతిపాదనలను గుంటూరు జిల్లా కలెక్టర్‌ పంపించాల్సి ఉన్నది. అయుతే తగినన్ని వివరాలు లేకపోవడం కారణంగా ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోన్నదని రిటైర్డు ఉద్యోగులు చెబుతోన్నారు. ఉమ్మడి జిల్లాలో నియమించిన ఔట్‌సోర్సింగ్‌ టైపిస్టులు, డైటా ఎంట్రీ ఆపరేటర్లను విభజించి పల్నాడు, బాపట్ల జిల్లాలకు పంపించారు. అయితే సిబ్బంది కేటాయింపునకు సంబంధించి ఆర్డర్స్‌ ఇంకా ఇవ్వనందున వారి జీతాలను గుంటూరు కలెక్టర్‌ డ్రా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయా జిల్లాలో వారు ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు వంటి వివరాలు అక్కడి నుంచి సకాలంలో వస్తేనే జీతాలు డ్రా చేయడం సాధ్యపడుతుంది. వీటన్నింటికి ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్‌లు రావాల్సి ఉన్నది. 


Updated Date - 2022-05-17T05:24:13+05:30 IST