Abn logo
Sep 22 2021 @ 01:18AM

పైసా వసూల్‌!

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న భాదితులు

జిల్లాలోని డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో విచ్చలవిడిగా దోపిడీ

ఇష్టారాజ్యంగా రక్తనమునాల పరీక్షలు

మామూలు జ్వరాలకు సైతం భారీ వసూళ్లు

బోర్డులో ఒక లెక్క.. తీసుకునేది మరో లెక్క

డాక్టర్లకు కమీషన్లు ఇస్తూ.. దండుకుంటున్న ల్యాబ్‌ల నిర్వాహకులు

కొన్నింటికి రిజిస్ట్రేషన్లు కూడా లేని వైనం

పాథాలజిస్టులు లేకుండానే నిర్వహణ

వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కరువు

కామారెడ్డి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి మండ లంలోని క్యాసంపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడికి తీవ్ర జ్వరం రావ డంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారు. సదరు డాక్టర్‌ రక్త పరీక్ష కోసం స్థానిక నేతాజీ రోడ్డులో గల ఓ ల్యాబ్‌కు పంపారు. అక్కడ ఫీజుల బోర్డుపై బ్లడ్‌ టెస్టుకు రూ.750 ఉంటే.. పరీక్ష అనంతరం రూ. 1500 ల్యాబ్‌ నిర్వహకులు వసూలు చేశారని భాదితులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు. అంతేకాకుండా సదరు ల్యాబ్‌పై కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితి ఆ ఒక్క బాలుడికే కాకుండా.. జిల్లాలో చాలామందికి ఎదురైంది. గత రెండు నెలల కాలంగా ఎంతో మంది రోగులకు సీజనల్‌ వ్యాధులను అంటగడుతూ రక్తనమునాల పేరిట విచ్చలవిడిగా డయాగ్నోస్టిక్‌ సెంటర్లు దోపిడీకి పాల్పడుతున్నాయి. రోగికి చిన్నదో, పెద్దదో ఏదో ఒక వ్యాధి వస్తే చాలు తమకు భుక్తి అనే విధంగా డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వహకులు భా వించడం గమనార్హం. నిర్ధిష్టమైన ధరలు నిర్ణయించకపోవడంతో ఇష్టా నుసారంగా రోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఏదో మొక్కుబడిగా నివే దికలు అందజేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల పాథాలజిస్ట్‌ లు సైతం లేకుండానే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  అనారోగ్యంతో వచ్చేవారి నుంచి డబ్బులు గుంజు కోవడానికే నిర్వాహకులు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరం. వైద్యు లు కొన్ని టెస్టుల కోసం సిఫారస్‌ చేస్తే.. కొందరు అవసరం లేని పరీక్షలు కూడా చేస్తున ్నట్లు సమాచారం.

వ్యాధుల సీజన్‌ వస్తే పండుగే..

సీజనల్‌ వ్యాధులు వస్తే చాలు వారికి పండగే. డాక్టర్లకు కమీషన్లు ఇవ్వడం.. వారితో రోగులను తమ వద్దకు రప్పించుకునేలా చేయడం ల్యాబ్‌ల నిర్వాహకుల కు నిత్యకృత్యమైంది. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, వైరల్‌ జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా వీరి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఇటీవలి కాలంలో కరోనా భయంతో ప్రాణాలు కోల్పోవడం, విష జ్వరాలు, డెంగ్యూతో   ప్లేట్‌లైట్స్‌ తగ్గి ప్రాణాల మీదకు వస్తుండడంతో రోగులు ముందుగా డాక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లితే చాలు నాడి పట్టకుండానే బీపీ, షుగర్‌, మూత్ర పరీక్షలు చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. డాక్టర్‌ చెప్పాడు కదా అని ల్యాబోరేటరీ కి వెళ్లితే రూ.100 నుంచి రూ.200 అవుతాయి అనుకుంటే చిన్న ఆసుపత్రులయి తే పరీక్షలు చేసి రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలకు వరకు, అదే పెద్ద ఆసుప త్రులయితే రూ.5వేలకు పైనే బిల్లు చెల్లిస్తే గాని రిపోర్ట్‌లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. పైగా పరీక్షలు చేసి తీసుకున్న డబ్బులకు బిల్లులు ఇవ్వరు. బిల్లులు ఇవ్వ కున్నా.. వాటికి తీరా డబ్బులు కట్టి డాక్టర్‌కు చూయించాక పరీక్షల్లో ఏమీలేదు, చిన్నపాటి జ్వరమే అనే సమాధానం వస్తుంది. ఇదీ జిల్లాలో ఉన్న డయాగ్నోస్టిక్‌ సెంటర్లు,  డాక్టర్ల పనితీరుకు నిదరనం.

ఫిర్యాదు ఇచ్చినా.. చర్యలు కరువు

ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు లేకుండానే జిల్లాలో వందల సంఖ్యలో ల్యాబ్‌లు నిర్వ హిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా విష  జ్వరాల వ్యాప్తి అధికంగా ఉండటం వీరికి కలిసి వస్తోంది. జ్వరం రాగానే తమకు ఏమైందోనని భయంతో రోగులు డ యాగ్నోస్టిక్‌  సెంటర్లకు పరుగులు తీస్తుండడంతో వారికి కలిసిరావడంతో  ఇదే అదనుగా వారు దోచేసుకుంటున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటర్‌ కూడా పాస్‌ కాని వ్యక్తులు పరీక్షలు నిర్వహించడం గమనార్హం. అలాంటి వారు చేసిన రిపోర్టులను చూసి డాక్టర్లు రోగులకు సమాధానాలు చెప్తుతున్నారు. గత నెలలో ఓ ఎంపీటీసీ భార్యకు సైతం ఓ గైనకాలజిస్ట్‌ వద్దకు నెలవారి పరీక్షల నిమిత్తం వెళ్లగా.. తమకు కమీషన్లు ఇచ్చే డయాగ్నోస్టిక్‌  సెంటర్‌కు రెఫర్‌ చేశారు. దీంతో అక్కడికి వెళ్లగా అధిక డబ్బులతో పాటు అనుమతులు లేకున్నా కరోనా పరీక్షలు చేసి వారి వద్ద నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. తీర సదరు ఎంపీటీసీ ప్రశ్నించడంతో వారిపైకి ఎదురుతిరిగి మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండి అంటూ దబాయించడమే కాకుండా ఆయన భార్యకు వైద్యం అందకుండా చేశారని డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. వీరి అలసత్వంపై విసిగెత్తిన ప్రజలు నేరుగా కలెక్టర్‌కే తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేస్తున్నారంటే వీరి పనితీరుపై ప్రజలకు ఏ విధమైన అపనమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రుల నుంచి నెలవారి వసూలు చేసే ఒకరిద్దరు సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చినా సరే ఎలాంటి చర్యలు తీసుకోకుండా సర్దుబాటు చేస్తున్నారని, అందుకే ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబోరేటరీల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సొంతశాఖ సిబ్బందే చెప్పడం గమనార్హం.

ఎక్కడా కనిపించని ఫీజుల బోర్డులు

జిల్లాలో ఏ ల్యాబోరేటరీలోనూ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో తెలిపే బోర్డు ఉండడం లేదు. దీనివల్ల వారు ఎంత అడిగితే అంత రోగులు ఇవ్వాల్సి వస్తోంది. డయాగ్నోస్టిక్‌  సెంటర్లు చేస్తున్న దోపిడీని ప్రజలు అధికారులకు తెలియజేస్తున్న లిఖిత పూర్వకంగా ఇస్తేనే చర్యలు తీసుకుంటాము అంటున్నారు తప్ప, చర్యలు మాత్రం చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. తీరా ఫిర్యాదు ఇచ్చాక దర్యాప్తు చేస్తున్నాం, చర్యలు తీసుకుంటామని చెప్పి కాలం వెల్లదిస్తున్నారే తప్ప ఏ విధమైన చర్యలకు పూనుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని చాలా ల్యాబ్‌లలో ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ కూడా చేయని ల్యాబ్‌ టెక్నీషియన్‌లు పనిచేస్తున్నా.. మూముళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం యూరిన్‌ కల్చర్‌, బ్లడ్‌ కల్చర్‌, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ వంటి పరీక్షలు చేయాల్సిన పేథాల జిస్టులు లేరు.

ల్యాబ్‌లో అధిక డబ్బులు వసూలు చేశారు

: తోట రాజు (బాధితుడు, క్యాసంపల్లి గ్రామం)

మా బాబుకు జ్వరం రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ పిల్లల ఆసుపత్రికి వెళ్లాం. సదరు ఆసుపత్రి వైద్యులు ఓ ల్యాబ్‌కు రక్త పరీక్షల కోసం పంపారు. రక్తపరీక్షల కోసం ల్యాబ్‌ నిర్వాహకులు బోర్డుపై రూ.750 ఫీజు అని ఉంచి, అదనంగా రూ.1500 డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై  ప్రశ్నిస్తే ధరలు పెరిగాయని, వైద్యాధికారులు సూచించిన మేరకే ఫీజులు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. ఇలాంటి ల్యాబ్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఫిర్యాదు అందిన ల్యాబ్‌పై విచారణ చేపడుతున్నాం

: చంద్రశేఖర్‌ (డీఎంహెచ్‌వో, కామారెడ్డి)

కామారెడ్డి పట్టణంలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నాం. అధిక ఫీజులపై సైతం ఐఎంఏకు పలు సూచనలు చేశాం. ఇష్టారీతిన వ్యవహరిస్తే డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవాలే తప్ప, అధిక ఫీజులు వసూలు చేయరాదు. ప్రతీ ల్యాబ్‌లో అర్హత గల వారే పరీక్షలు నిర్వహించాలి.